ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది మోడీ ఇమేజ్ మసకబారుతోందన్న విశ్లేషణలు చేయడం ప్రారంభించారు. దీనికి కారణాలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే కాదు.. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి లోక్సభ నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాలుకూడా అదే చెబుతున్నాయి. గత ఏడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే.. రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోయింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో.. 40 జిల్లా పంచాయతీ స్థానాలుంటే అందుకే కేవలం 8 సీట్లకే బీజేపీ మద్దతుదారులు పరిమితమయ్యారు. ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్యలోనూ సేమ్ సీన్.
కర్ణాటకలోనూ అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమై పరువు పోగొట్టుకుంది. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడింది. బీజేపీకి కంచుకోటగా చెప్పుకునే బళ్లారి కార్పొరేషన్ సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు. బెంగాల్లో పోయిన పరువుతో ఇక కొత్తగా ఎక్కడా బలం పుంజుకునే పరిస్థితి లేదు.
ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో మోదీ అవలంభిస్తున్న ఉదాసీన వైఖరి విమర్శల పాలవుతోంది. దేశ ప్రజల ప్రాణాలు బలిపెట్టి.. వ్యక్తగత ఇమేజ్ కోసం.. విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేశారనే అపవాదు ఆయన్ను వెంటాడుతూనే ఉంది. ఏడెనిమిది నెలల్లో జరగాల్సిన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికలు.. వచ్చే ఏడాది ఆఖర్లో జరగాల్సిన హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. మోదీ, అమిత్ షా నాయకత్వానికి మరింత అగ్నిపరీక్షగా మారనున్నాయి. బీజేపీ కంచుకోటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ బలమైన ప్రతిపక్షాలే ఉన్నాయి. అక్కడా బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలితే.. అప్పుడు.. మోడీ హవా తగ్గిపోయిందన్న అంచనాలకు రావొచ్చు. ఇప్పుడే రావడం.. తొందరపాటే అవుతుంది.