మరోసారి ఉద్యమానికి సిద్ధంగా ఉండాలంటూ కాపు సంఘాలకు ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు..! కాపుల రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాపులు చేసిన ఉద్యమం ఫలితంగానే విద్యా ఉద్యోగ రంగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారనీ, అయితే ఆ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెచ్చే విధంగా కృషి చేయాలనీ, మార్చి నెలాఖరులోగా దానికో చట్టబద్ధత కల్పించాలన్నారు. అప్పటికీ ఓ స్పష్టత రాకపోతే మరోసారి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుందని ముదగ్రడ హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్లనే తమ జాతి బిడ్డలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాపుల కోసం ఉద్యమం చేస్తున్న తాను, తన కుటుంబం చాలా అవమానాలు పడాల్సి వచ్చిందనీ, గోదావరి జిల్లాల్లో కాపులను చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు.
విభజన తరువాత కేంద్రం నుంచి ఆంధ్రాకు రావాల్సినవేవీ పూర్తి స్థాయిలో రాలేదు. వాటిపై కదా రాష్ట్రంలో ఇప్పుడు చర్చ జరుగుతున్నది. అన్ని పార్టీలూ నేతలూ ఒక్కటవ్వాల్సిన సమయం ఇదే కదా..! జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచాలంటే అన్ని వర్గాల ప్రజలూ కలిసి నిలవాల్సిన సమయం ఇది. కానీ, ఇలాంటి సమయంలో కూడా ముద్రగడ స్పందన అలా ఉంది మరి! అయితే, కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా చేయాలీ, పొత్తు తెంచేసుకోవాలీ, ఆ తరువాత కేంద్రంపై టీడీపీ సర్కారు ఉద్యమిస్తే… అప్పుడు తమ జాతి పరిపూర్ణ మద్దతు ఇస్తుందని ఓ మొక్కుబడి ప్రకటన కూడా చేశార్లెండి. అంతేనా… పవన్ కల్యాణ్ గురించి కూడా మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం, కేంద్ర కేటాయింపుల అంశమై జనసేన అధినేత తనకున్న పరిధిలో స్పందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రత్యేక హోదా సాధన పోరాటానికి పవన్ కల్యాణ్ నాయకత్వం సరిపోదని అన్నారు.
ఈ సమయంలో కేవలం కాపు ఉద్యమ నేతగానే ముద్రగడ ఆలోచిస్తున్నట్టున్నారు, ఆ పరిధి దాటి రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడేందుకు కావాల్సిన సంసిద్ధత ఏదీ..? పోరాటానికి పవన్ నాయకత్వం చాలదు, టీడీపీ రాజీనామా చేయాలి.. ఈ కండిషన్లకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాటానికి సిద్ధం అని మాత్రం చెప్పడం లేదు. అలాగని, కాపుల రిజర్వేషన్ల విషయమై ఓ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి, ఆయన మాట్లాడకూడదని చెప్పడం ఇక్కడి ఉద్దేశం కాదు. మార్చి 31 తరువాత ఉద్యమిస్తామంటూ చేస్తున్న ప్రకటననీ తప్పుబట్టడం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. రాష్ట్ర ప్రయోజనాలే సందిగ్ధంలో ఉన్న ఈ సమయంలో ముద్రగడ వ్యవహార శైలిలో ప్రాధాన్యతా క్రమం ప్రశ్నార్థకంగా ఉందని చెప్పడం.