సాధారణంగా… ప్రజల సమస్యల గురించి ప్రతిపక్షం మాట్లాడాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాటాలు చేయాలి. ఆ తరువాత ప్రభుత్వం స్పందించి… సదరు సమస్యకు పరిష్కారం చూపాలి. అధికార పక్షం ఏదైనా సరే… ప్రతిపక్షం ఎత్తిచూపే సమస్యలపై స్పందించాలి. కానీ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు మాత్రం ఇందుకు భిన్నం! ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఏ సమస్య లేవనెత్తినా చంద్రబాబు స్పందించరు. పైగా, విపక్షం చేసే విమర్శలకి రాజకీయ కోణం ఆపాదించి.. తిప్పి కొట్టేస్తుంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే… జనసేన అధినేత ఏ సమస్య గురించి మాట్లాడినా ముఖ్యమంత్రిగానీ, ఇతర మంత్రులుగానీ వెంటనే స్పందించేస్తుంటారు! ఏదో ఒక ప్రకటన చేస్తుంటారు.
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారి గురించి ఈ మధ్య పవన్ స్పందించిన సంగతి తెలిసిందే. నిజానికి అక్కడ ఎప్పటి నుంచో ఈ సమస్య ఉంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్థానిక తెలుగుదేశం నేతలకు తెలియకుండా ఉంటాయా..! కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ సమస్య గురించి స్పందించేసరికి… సర్కారులో చలనం వచ్చేసింది. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా డాష్ బోర్డ్ మీద ప్రత్యక్షం అవుతుందని చెప్పుకునే హైటెక్ ముఖ్యమంత్రికి… ఎన్నోయేళ్లుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలియకుండా ఉంటాయా చెప్పండీ. డాష్ బోర్డులో ఇలాంటివేవీ కనిపించవా..? ఏదైతేనేం పవన్ కల్యాణ్ చెప్పగానే వెంటనే స్పందించేశారు. సమస్యపై దృష్టి సారించేశారు.
ఇదే కాదు.. ఆ మధ్య పవన్ కల్యాణ్ టేకప్ చేసిన ఆక్వా ఫుడ్ పార్క్ రైతుల సమస్యలో కూడా ఇంతే! తొందుర్రు రైతులకు మద్దతుగా పవన్ నిలిచారు. ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. పవన్ ఎంట్రీతో చంద్రబాబు సర్కారు కాస్త వెనక్కి తగ్గినట్టే అనిపించింది. కానీ, ఆ తరువాత జరగాల్సింది కాస్తా జరిగిపోయింది. ఆక్వాపార్క్ విషయంలో వెనక్కి తగ్గేది లేదనీ, పనుల వేగం పెంచాలని ఓ సమీక్ష సమావేశంలో సీఎం ఆదేశించేశారు. అంతకుముందు రాజధాని ప్రాంత నిర్వాసిన రైతుల విషయంలోనూ అంతే. పవన్ స్పందించిన వెంటనే చంద్రబాబు సర్కారు ప్రతిస్పందించేసింది.
ఏదైనా ఒక సమస్య పవన్ దృష్టికి రాగానే ఆయన ఆవేశంగా స్పందించేస్తారు. వెంటనే, చంద్రబాబు సర్కారులో కూడా కదిలక వచ్చేస్తుంది. అంతే… అక్కడితో పవన్ కల్యాణ్ ఖుషీ అయిపోయి తన పోరాటాన్ని విరమించుకుంటారు. ప్రతిపక్ష వైకాపా అధినేత జగన్ చేసే పోరాటాలపైనా, ఎత్తిచూపే సమస్యలపైనా చంద్రబాబు స్పందన ఇంత చురుగ్గా ఉండదు ఎందుకో..? కేవలం పవన్ చెబితే మాత్రమే చంద్రబాబుకు ఏ సమస్య అయినా బాగా అర్థమౌతుంది.. ఎందుకలా?