గౌరవం లేని చోట పొత్తులో ఉండలేమని తేల్చి చెప్పి.. ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతూండగానే బీజేపీకి తెలంగాణలో గుడ్ బై చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున పవన్ ఇచ్చిన స్టేట్మెంట్తో బీజేపీ నేతల మైండ్ బ్లాంక్ అయింది. ఆ తర్వాత కూడా పవన్‌తో సంబంధాలు పునరుద్ధరణకు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. తెర వెనుక ఏం అయినా జరిగిందో లేదో కానీ… సాగర్ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలనుకుని కమిటీని నియమించి కూడా పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గారు.
ఇప్పుడు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో.. అంతర్గతంగా రెండు పార్టీల మధ్య సమస్య పరిష్కారం కోసం.. ప్రయత్నాలు జరిగాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేన అధినేతతో సంప్రదింపులు జరిపి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న ఖమ్మంలో … ఆయనతో పొత్తు బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంలో బీజేపీ ఉంది. అందుకే.. పవన్‌కు మళ్లీ కావాల్సినంత గౌరవం ఇచ్చి.. సర్దుబాటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
తెలంగాణలో బీజేపీతో కటిఫ్ చెప్పడంతో.. ఏపీలోనూ అదే చేస్తారన్న ప్రచారం జరిగింది. పోతిన మహేష్ లాంటి నేతలు.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని .. తాము హైకమాండ్‌కు ఇదే విషయాన్ని చెబుతామని కూడా ప్రకటించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుండి… జనసేనకు త్యాగాలు తప్ప.. మరో చాయిస్ లేకుండా పోయింది. ఏపీలో ప్రజాసమస్యలపై గొంతెత్తలేని పరిస్థితి. అలాగే రాజకీయాల పరంగా కూడా జనసేన ఇక్కట్లలో ఉంది. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ జనసేన అధినేతను … లైన్లో పెట్టుకోవడంతో… ఏపీలోనూ పరిస్థితి తేలిక పడే అవకాశం ఉంది.