అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ నిన్న చాలా ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఫిలసాఫికల్ గా సాగి అభిమానులకి కిక్ ఇవ్వలేక కాస్త చప్పగా సాగిన ఫీలింగ్ తెచ్చింది. అయితే ఈ స్పీచ్ లో భాగంగా తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ తనని డిప్రెషన్ లో నించి బయట పడేశాడని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అందుకే ఆయనకు మనస్పూర్తిగా జోహార్లు అర్పిస్తున్నా అన్నారు. అయితే ఈ మాటని పట్టుకుని కొందరు – బతికివున్నవాళ్లకు జోహార్లు అర్పించరు, పోయినవాళ్లకు తప్ప అంటూ రచ్చ మొదలెట్టేశారు. మరి పవన్ నిజంగా టంగ్ స్లిప్ అయ్యాడా?
జోహార్లు అన్న పదం సాధారణంగా అమరులైన వారికి ఉపయోగించే విషయం నిజమే అయినా ఆ పదం కేవలం చనిపోయినవారికే పరిమితం కాదు. ఉదాహరణకి చూస్తే – కె. బాలచందర్ దర్శకత్వం లో “ఆడాళ్లూ మీకు జోహార్లు” అంటూ 1981 లో కృష్ణంరాజు, జయసుధ, వై.విజయ, సరిత, చిరంజీవి తారాగణం తో తెలుగు సినిమా ఒకటి వచ్చింది. నిజానికి ఇదే టైటిల్ తో మళ్ళీ కిషోర్ తిరుమల దర్శకత్వం లో వెంకటేష్ హీరోగా ఒక సినిమా కూడా ప్లాన్ చేసారు కానీ ఎందుకో అది కార్య రూపం దాల్చలేదు. అలాగే సీఎస్ లాంటి ఉన్నత స్థాయి వ్యక్తులు పదవీ విరమణ చేస్తున్నపుడు కేసీ ఆర్ సైతం “ఆయన ప్రతిభ కి జోహార్లు” అంటూ వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా ఏ సెలబ్రిటీ స్పీచులిచ్చినా , ఏ హీరో ఉపన్యసించినా ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకుని కోడి గుడ్డు మీద ఈకలు పీకడం తరహా లో విమర్శలు ఎక్కుపెట్టడం అనే ట్రెండ్ ఈ మధ్య కొంచెం పెరిగిందనే చెప్పాలి.