ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఊహించిన దానికి భిన్నంగా తోలి విడత లోనే ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఖచ్చితంగా నెల రోజుల సమయం కూడా లేదు. తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరిగిపోయాయి. అక్కడ లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరగాలి. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం లోక్ సభతో పాటు అసెంబ్లీ కి కూడా ఎన్నికలు జరుగుతాయి. అందరూ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది చర్చించుకుంటున్నారు, కానీ అసలు ఓటరు సిద్ధంగా ఉన్నడా లేదా అనేది ప్రశ్న. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ కోసం చాలామంది ఓటర్లు ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు.
తాము ఇష్టపడే నాయకుడిని గెలిపించుకోవడానికి ఓట్లు వేసేవాళ్ళు కొంతమంది అయితే, మంచి చెడు ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు ని ఆలోచించే వాళ్ళు కొంతమంది. అభ్యర్థి తమ కులం వాడా కాదా అని చూసేవాళ్ళు కొంతమంది అయితే, అభ్యర్థి అన్ని కులాలకి న్యాయం చేస్తాడా లేదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది. నోటుకు ఓటు అమ్ముకునే వాళ్ళు కొంతమంది అయితే, విదేశాల నుండి సుదూర ప్రాంతాల నుండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే వాళ్ళు కొంతమంది. ఎలాగైనా ఓటు వేసేవాళ్ళతో సమస్య లేదు. సమస్యంతా అసలు ఓటు వేయకుండా ఉండని వాళ్ళతోనే. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా కేవలం 60 % నుండి 70 % మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఓటు వేయడానికి ఇష్టపడరు. నేను ఓటు వేయడం వలన నాకు ఏమి ఒరిగేది లేదు, మా బ్రతుకులు మారేవి లేవు అని కొంతమంది అనుకుంటే, అనవసరంగా అక్కడ క్యూ లో నుంచుని ఓటు వేసే బదులు చక్కగా ఫ్యామిలీ తో కాలక్షేపం చేద్దాం అనుకునేవాళ్లు కొంతమంది ఉంటారు. అందుకు అనుగుణంగానే ఈ సారి ఎలక్షన్ కూడా గురువారం (ఏప్రిల్ 11 ) వచ్చింది. చాలావరకు ఉద్యోగాలు చేసేవాళ్ళు శుక్రవారం కూడా సెలవు తీసుకుంటే ఎంచక్కా నాలుగు రోజులు ఎంజాయ్ చేయవచ్చని, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు అనుకోని సరదాగా ఏ ట్రిప్ కో వెళ్ళిపోతారు. మొన్న హైదరాబాద్ లో జరిగిన ఎలక్షన్ చూసాము కదా, చదువుకున్న వాళ్ళు ఎంత శాతం ఓట్లు వేసారో. ఈ సారి కూడా మళ్ళీ అదే జరగబోతుంది. అసలే ఎండాకాలం, ఇంక చెప్పేదేముంది.
ఈ మధ్య జరిగిన చాలా సంఘటనలు కూడా పోలింగ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. పోలింగ్ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి అనుమానాలు కలుగుతున్నాయి. ఎలక్షన్ కోసం వాడే ఈవీఎంల మీద ప్రతి రోజు ఎక్కడో ఒకచోట చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ఓట్ల తొలగింపు ప్రక్రియ…. గత పది రోజులుగా ఆంధ్ర రాష్ట్రమంతా కూడా ఇదే చర్చ. ఓటు ఉన్న వారికి ఓట్లు తీసేసి, ఓట్లు లేనివారికి దొంగ ఓట్లు కల్పిస్తున్నారు. విజయాన్ని డిసైడ్ చేసేది కేవలం 2 నుండి 5 శాతం మాత్రమే కావడంతో, రాజకీయ పార్టీలు ఆ ఓట్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మొన్న తెలంగాణ లో జరిగిన ఎన్నికలలో కూడా ఇలానే జరిగిందని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు ఆంధ్ర లో కూడా అదే విధంగా అధికారం లోకి రావాలని కొన్ని పార్టీలు ప్రయత్నించాయి.
ఇక జంపింగ్ జపాంగ్ ల విషయానికొస్తే, మనం ఈ రోజు ఓటు వేసిన వ్యక్తి రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి. మనకి ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రి ని డైరెక్ట్ గా ఎన్నుకునే అవకాశం లేదు, మనం ఎన్నుకునే MLA, MP లు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నరాజకీయ క్రీడలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అభ్యర్థి ని చూసి ఓటు వేసినా కూడా, ఆ మరుసటి రోజు మన ఓటు ఎటు పోతుందో తెలియదు. ఇలాంటి విషయాలన్నీ కూడా, ఒక సగటు ఓటరుకు ఓటు వేయాలనే ఆసక్తి ని పోగొడుతున్నాయి.
ఎలక్షన్ కమిషన్ కూడా ఓటు హక్కు విలువని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. పోలింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరికి ఎన్నికల మీద అవగాహన కల్పించాలి. వారు వేసే ఓటు వలన వారి జీవితాలు గాని, వారి పిల్లల భవిష్యత్తు గాని, రాష్ట్ర దేశ అభివృద్ధి గాని ఎలా ముడిపడి ఉంటాయో తెలియజెప్పాలి. ఒక్క ఓటు విలువేమిటో చెప్పే ప్రయత్నం చేయాలి. ఎలక్షన్ ప్రక్రియ ను కఠినం చేసి ఓటర్లకు, ఎలక్షన్ మీద ఆసక్తి ని పెంచాలి. కేవలం ఒక్క 5 % ఓట్లు పెరిగిన కూడా, విజయావకాశాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది.
చూద్దాం…. ఈ సారి సోషల్ మీడియా ప్రభావం కూడా ఎంతలా ఉంటుందో, ఎంతమంది యువత తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారో.
–హరీష్