పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. “సాక్షి” మీడియా వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఏ పని జరిగినా… దాన్ని.. అత్యంత దారుణంగా… “అదో పనికి మాలిన పని” అన్నట్లుగా తీసి పడేయడం ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోంది. అత్యధిక కాంక్రీట్ వర్క్ జరిగి.. గిన్నిస్ రికార్డు సృష్టించిన సమయంలోనూ.. సాక్షి పత్రిక ఇలాంటి కవరేజీనే ఇచ్చింది. “నాణ్యత లేని పనుల్లో రికార్డు” అంటూ.. కథనం అల్లేసింది. ఓ వైపు అత్యంత ఉన్నత ప్రమాణాలతో.. నిర్మిస్తున్నారని చెబుతూ.. కేంద్రం అవార్డులు ఇస్తూ ఉంటుంది. మరో వైపు.. సాక్షి పత్రిక ప్రతీ పనిని దారుణంగా విమర్శిస్తూ కథనాలు రాస్తూ ఉంటుంది.
పోలవరం ప్రాజెక్ట్ ఆషామాషీ ప్రాజెక్ట్ కాదు. క్వాలిటీ విషయంలో… రాజీ పడటానికి అదేమి.. మామూలు అపార్ట్మెంట్ కాదు. సాధారణ ఇంజినీర్లు అక్కడ పని చేయడం లేదు. దేశ, విదేశాల నుంచి అటు కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన ఇంజినీర్లు.. ఇటు పోలవరంప్రాజెక్ట్ కు సంబంధించిన ఇంజినీర్లు వందల సంఖ్యలో పని చేస్తున్నారు. గిన్నిస్ రికార్డు కాంక్రీట్ పనుల కోసం… విదేశీ ఇంజినీర్లే కనీసం.. వెయ్యి మంది విధుల్లో ఉన్నట్లు… చెబుతున్నారు. నాణ్యతా ప్రమాణాల్లో ఏ మాత్రం రాజీ పడకుండా పనులు సాగుతున్నాయని… ఏపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ సాక్షి పత్రిక మాత్రం… ఏదో ఒకటి పని చేస్తున్నారని కాబట్టి.. అందులో నాణ్యత లేదని… రాసేస్తే సరిపోతుందని… కథనం అల్లేస్తోంది.
ఏపీకి జీవనాడి వంటి ప్రాజెక్ట్.. దశాబ్దాలుగా… మాటలేక పరిమితమైన ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ఓ రూపు వస్తోంది. ఇలాంటి ప్రాజెక్ట్ విషయంలో సాక్షి పత్రిక అనుసరిస్తున్న ఎడిటోరియల్ విధానం… కచ్చితంగా పాఠకులకు అసహనానికి గురి చేసేదే. తప్పులు ఉంటే ఎత్తి చూపొచ్చు కానీ.. గేట్లు పెట్టడం ప్రారంభించినా కూడా తప్పేనన్నట్లుగా… వ్యవహరించడం.. చుక్క నీళ్లు లేకుండా గేట్లు పెడుతున్నారని… సాక్షి మీడియా యజమాని జగన్ వెటకారాలు చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ క్వాలిటీ చెక్ బాధ్యతల్ని సాక్షి జర్నలిస్టులకు ఇస్తే.. వారు రాసిందే సర్టిఫికెట్లుగా భావించుకుంటే.. అప్పుడే… సాక్షి పత్రిక సంతృప్తి చెందుతుందేమో..?