ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేయాలన్న అంశంపై పునరాలోచించాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ … ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. మొదటి విడత ఎన్నికల వాయిదాకు కారణం ప్రవీణ్ ప్రకాష్‌గా నిర్ధారించిన నిమ్మగడ్డ.. ఆయనను తక్షణం బదిలీ చేయాలని మూడు రోజుల కిందట ఆదేశించారు. కానీ సీఎస్ అమలు చేయలేదు. తర్వాత ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేయాలని మరోసారి హెచ్చరిస్తూ… లేఖ రాశారు. కానీ సీఎస్ ఆదిత్యనాథ్ స్పందించలేదు. దాంతో ఆదివారం కూడా.. మరోసారి నిమ్మగడ్డ లేఖ రాశారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్నారని ఆ లేఖలో హెచ్చరించారు. ఇంకా స్పందించకపోతే బాగుండదని అనుకున్నారేమో కానీ.. ఆదిత్యనాథ్ దాస్.. ఓ లేఖ రాశారు.
ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలో లేరని సీఎం ఆ లేఖలో చెప్పుకొచ్చారు. ప్రవీణ్ ప్రకాశ్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఆదేశాలను పునఃపరిశీలించాలని లేఖలో కోరారు. అయితే ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు ప్రవీణ్ ప్రకాష్ అడ్డం పడ్డారని.. ఆ విషయాన్ని స్వయంగా అంగీకరించారని నిమ్మగడ్డ ఇప్పటికే రెండు సార్లు లేఖలు రాశారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ప్రవీణ్ ప్రకాష్ అన్నింటికీ అతీతుడని.. ఆయనకు కోడ్ వర్తించదని సీఎస్ చెప్పడం అధికార వర్గాల్లోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆయనను బదిలీ చేయకూడదన్న పట్టుదలతో సీఎస్ ఉన్నారు. ఆయనను కూడా బదిలీ చేస్తే సీఎం జగన్ కు ఆగ్రహం తెప్పిస్తుంది. అందుకే… చీఫ్ సెక్రటరీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరో వైపు సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు విచారణకు రానుంది. అందులో ఆదిత్యనాథ్ దాస్‌నూ చేర్చారు. కోర్టు ఆదేశించినా ఎన్నికలకు సహకరించలేదని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే… ఉన్నతాధికారులంతా ఇరుక్కుపోయే ప్రమాదం కనిపిస్తోంది.