లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఒక సభ నిర్వహించారు. శంషాబాద్ లో జరిగిన సభలో ఆయన ప్రధానమంత్రి మోడీ విధానాలపై తీవ్రమైన విమర్శలు చేశారు. నరేంద్ర మోడీ నిజమైన దేశ భక్తుడు అయితే నోట్ల రద్దుతో సామాన్యులను క్యూ లైన్లలో నిలబెట్టరనీ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ తో వ్యాపారులను దెబ్బతియ్యరంటూ విమర్శించారు. మోడీ విధానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలు మోడీ వెర్సెస్ కాంగ్రెస్ అన్నారు. అంటే, తెరాస వెర్సెస్ కాంగ్రెస్, లేదా భాజపా అన్నట్టు చూడొద్దని పిలుపునిచ్చారు.
అయితే, ఇప్పటికే లోకసభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన కేటీఆర్… కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని మనమే శాసిస్తామనీ, పార్లమెంటులో తెరాస ప్రతినిధులు ఉండాలనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి ప్రచారంగా తీసుకెళ్తున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాకి కాలం చెల్లిందనీ, దేశానికి కొత్త నాయకత్వం అవసరమనీ, కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రెంట్ ద్వారా అది సాధ్యమంటూ వరుసగా నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. అంటే, లోక్ సభ ఎన్నికలను భిన్నంగా చూడొద్దనీ, తెరాసకే మొత్తం ఎంపీ స్థానాలు దక్కాలనే వ్యూహంతో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వెర్సెస్ భాజపా అన్నట్టుగా ఈ ఎన్నికల్ని రాష్ట్ర స్థాయిలో ప్రజలు భావించరాదనే పక్కా ప్రణాళికతో ఉన్నారు.
ఈ అభిప్రాయాన్ని రాహుల్ సభ ద్వారా కొంత తగ్గించే ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మోడీ, కేసీఆర్ లను ఒకే గాటన కట్టి విమర్శలు చేయడం, కేసీఆర్ కి ఓటేస్తే మోడీకి వేసినట్టేననీ, మోడీ పాలనలో కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే కాంగ్రెస్ ఎంపీలను మాత్రమే గెలిపించాలనే అభిప్రాయాన్ని రాహుల్ కొంతమేర కల్పించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారపరంగా తెలంగాణకు కాంగ్రెస్ కి ఇది మంచి ప్రారంభంగానే చెప్పొచ్చు. అయితే, అంతర్గతంగా పార్టీ బలోపేతానికి రాహుల్ సభ ఎంతటి భరోసా ఇచ్చిందనేదే అసలు ప్రశ్న? అసెంబ్లీ ఎన్నికల ఓటమి తరువాత… రాష్ట్రస్థాయిలో నాయకత్వ మార్పు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేల్లో కొంతమంది ఇప్పటికే పార్టీని వదిలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ మరింత బలపడుతుందనే భరోసాని పార్టీ వర్గాల్లో రాహుల్ సభ నింపిందా అంటే… పూర్తిగా అవునని చెప్పలేం. ఒకవేళ.. కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ల కోసం ఇతర పార్టీల నుంచి కొందరైనా వస్తున్న పరిస్థితి ఉంటే… ఉన్న నాయకుల్లో భరోసా పెరుగుతుంది. పార్టీని వదిలి వెళ్తున్నవారిని బుజ్జగించే ప్రక్రియే ఇక్కడ జరగడం లేదు, అలాంటిది కొత్తవారికి ఆకర్షించగలిగే పరిస్థితి ఎలా వస్తుంది? ఎలా చూసుకున్నా రాహుల్ సభ కాంగ్రెస్ ప్రచారానికి ప్లస్ కావొచ్చు, కానీ ఉన్న నేతల్లో భరోసా నింపడంలో ప్లస్ కాలేదు.