గేమ్ ఛేంజర్ ట్రైలర్ మెగా ఫ్యాన్స్ లో కొత్త జోష్ ఇచ్చిందన్న మాట వాస్తవం. రామ్ చరణ్ అందంగా కనిపించాడు. హీరోయిజానికి లోటు లేదన్న విషయం అర్థమైంది. ఇక విజువల్ గ్రాండియర్ అంటారా… శంకర్ అందుకు పెట్టింది పేరు. ప్రతీ ఫ్రేమ్‌లోనూ అది కొట్టొచ్చినట్టు కనిపించింది. ట్రైలర్ లో లెక్కలేనన్ని షాట్లు పెట్టేశాడు శంకర్. ఒకదాన్ని మించి మరోటి ఉన్నాయి. చరణ్ గుర్రపు సవారీ, హెలీకాఫ్టర్ నుంచి, లుంగీ తో దిగే షాట్, దోప్ సాంగ్… ఇలా అన్ని చోట్లా విజువల్ ఫీస్టే. అయితే శంకర్ కథని ఎక్కడా రివీల్ చేయలేదు. పాత్రల్ని సైతం పూర్తి స్థాయిలో పరిచయం చేయలేదు. ఇవన్నీ లేకుండానే సంతృప్తికరమైన రీతిలో ట్రైలర్ కట్ చేసేశాడు. ఈ విషయంలో శంకర్‌కీ, ఎడిట్ టీమ్ కీ ఫుల్ మార్కులు పడతాయి. శంకర్ తాను చెప్పాల్సిన కథని వెండి తెరపైనే చూపించాలని ఫిక్సయ్యాడు. కాకపోతే ఈ సినిమాలో విజువల్స్ ఎంత గ్రాండ్ గా ఉంటాయో రుచి చూపించాడు. దిల్ రాజు అయితే చూపించింది 40 శాతమే, చాలా దాచేశాం అని ఊరిస్తున్నాడు. కాబట్టి… కనీసం మినిమం గ్యారెంటీ సినిమా అయితే ఇవ్వబోతున్నారన్న సంగతైతే అర్థం చేసుకోవొచ్చు.
ఇప్పటి ప్రేక్షకులు పెద్దగా ఏం కోరుకోవడం లేదు. తమ హీరో మాస్ ఎలివేషన్లు, అక్కడక్కడ హైప్, కనీసం గుర్తుండిపోయేలా 4 సీన్లు.. అంతే. టికెట్ రేటు గిట్టుబాటు అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ‘గేమ్ ఛేంజర్’ నుంచి కూడా ఇదే ఆశిస్తున్నారు. నిజానికి `భారతీయుడు 2` రిజల్ట్ కాస్త ప్లస్సూ, కాస్త మైనస్సు. ‘భారతీయుడు 2’ తరవాత శంకర్ తీసిన సినిమా ఇది కాబట్టి, అంచనాలు పెద్దగా లేవు. అదే ఇప్పుడు ప్లస్సయ్యింది. యావరేజ్ సినిమా తీసి పెట్టినా, జనాలు ‘ఇది చాల్లే’ అని సంతృప్తి పడిపోతారు.
సెన్సార్ రిపోర్ట్ ఏమో.. ఇది పక్కా పైసా వసూల్ సినిమా అని చెబుతోంది. కనీసం అరడజను సీన్లు ఫ్యాన్స్ కి నచ్చేలా వచ్చాయట. అవి చరణ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తాయి. సంక్రాంతి సీజన్లో విడుదల కావడం మరో పెద్ద ప్లస్స్. యావరేజ్ సినిమాలు సైతం బాక్సాఫీసు దగ్గర వసూళ్ల బొనాంజా సృష్టించే అవకాశం సంక్రాంతి సీజన్‌కు ఉంది. వీటన్నిటింనీ దృష్టిలో ఉంచుకొంటే దిల్ రాజు కష్టం ఫలించేలానే కనిపిస్తోంది.