ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోరాటం.. ఇదొక్కటే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ముందున్న అజెండా! తెలుగుదేశం పార్టీలో కొనసాగితే ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితి లేదు. అందుకే, ఆయన కాంగ్రెస్ లోకి వచ్చి చేరారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, రేవంత్ లక్ష్యాన్ని కాంగ్రెస్ ఎలా చూస్తోంది..? పార్టీలో చేరగానే రేవంత్ మొదలపెట్టిన పోరాటాన్ని తమదే అని పార్టీ కూడా భావిస్తోందా..? నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వోద్యోగం పొందారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు హరనాథరావుపై రేవంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, రేవంత్ లేవనెత్తిన ఈ అంశాన్ని కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదు. అక్కడితో ఆగినా బాగుండేది. దీనిపై కొందరు కాంగ్రెస్ నేతలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారట! హైకమాండ్ వైఖరిని రేవంత్ కి ఎక్కించే ప్రయత్నాలు చేస్తుండటం విశేషం.
నీచ్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మణిశంకర్ అయ్యర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే రాహుల్ స్పందించి, దిద్దుబాటుచర్యలకు దిగారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే విషయాన్ని రేవంత్ కి అప్లై చేస్తూ… ముఖ్యమంత్రి వియ్యంకుడిపై ఆరోపణలు చేస్తే చెయ్యొచ్చుగానీ, దీన్ని నేపథ్యంగా చేసుకుని కేటీఆర్ భార్యపై విమర్శలు చేయడం తగదని గాంధీ భవన్ లో కొందరు విశ్లేషించారట! ఎవరిపైన అయినా వ్యక్తిగత ఆరోపణలకు దిగితే పార్టీ సహించదనేది మణిశంకర్ అయ్యర్ విషయంలో రాహుల్ స్పష్టం చేశారనీ, పార్టీ విధానాలను విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తే ఏ స్థాయి నాయకులనైనా ఉపేక్షించరనేది అర్థం చేసుకోవాలని అన్నారట! అంతేకాదు, రేవంత్ పోరాటం కేసీఆర్ పై అయితే, ఎలాంటి సంబంధమూ లేని కేటీఆర్ భార్యను మధ్యలోకి ఎందుకు లాగడమనీ, దీన్ని తెలంగాణ మహిళలు మరోలా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుందని కూడా విశ్లేషించారట!
అంటే, పరోక్షంగా రేవంత్ కి ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేశారన్నమాట. కేసీఆర్ పై రేవంత్ పోరాటం అనేది ఆయన వ్యక్తిగత ఇష్యూగా చూస్తున్నట్టున్నారు. దాన్లో పార్టీ అవసరం కంటే, రేవంత్ రెడ్డి ఆవేదనా కోణం ఒక్కటే వారికి అర్థమౌతున్నట్టుగా ఉంది. నిజానికి, ఇందులో రేవంత్ తప్పు కూడా కొంత కనిపిస్తోంది. తన కుమార్తె వివాహానికి ఒక పూట అనుమతితో జైలు నుంచి రావాల్సి వచ్చిందనీ, తండ్రిగా తాను ఎంతో ఆవేదన చెందానని రేవంత్ ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. తన జైలు జీవితం ఎపిసోడ్ అంతా తెరాస కక్ష సాధింపుగా వివరిస్తారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకోవచ్చు.. కానీ, తాను కేసీఆర్ పై చేస్తున్న పోరాటానికి నేపథ్యంగా వ్యక్తిగత భావోద్వేగాలనే ప్రేరణ అన్నట్టు చూపుతున్నారు. అంతకంటే, ఎక్కువగా రాష్ట్ర ప్రజల అవసరాన్ని ప్రదర్శించాలి కదా! దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ ఇష్యూని రేవంత్ వ్యక్తిగత కోణం నుంచే చూస్తున్నట్టుగా ఉంది.