సీఎం రేవంత్ రెడ్డి భాష రాను రాను కటువుగా మారుతోంది. ఇతర విషయాల్లో ఎలా ఉన్నా తన ప్రభుత్వ మనుగడ గురించి వ్యాఖ్యలు చేస్తున్న అంశంపై మాట్లాడే సమయంలో ఆయన పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన ప్రజాదీవెన సభలో రేవంత్ రెడ్డి చాలా వరకూ నాటుగా ప్రసంగించారు. ప్రభుత్వం జోలికి వస్తే మానవ బాంబులం అవుతామని.. పేగులు మెడలో వేసుకుని తిరుగుతామని హెచ్చరించారు. ఇతర విషయాల్లో చాలా పద్దతిగా కౌంటర్ ఇస్తున్నారు. కానీ ప్రభుత్వంపై కుట్రల విషయం వచ్చే సరికి మాత్రం… ఆగడం లేదు.
ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల తర్వాత పడిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లేందుకు కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పష్టత రావడంతోనే రేవంత్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారన్న అభిప్రాయం కాంగ్రెస్ లో వినిపిస్తోంది. సందుల్లోనో.. గొందుల్లోనో ఎవర్నైనా గోకితే ఊరుకునేది లేదని హెచ్చరించడం వెనుక… లోతైన అర్థం ఉందన్న అంచనాలకు వస్తున్నారు.
రేవంత్ రెడ్డి అధికారంలో ఉండకూడదన్నట్లుగా బీఆర్ఎస్ శైలి ఉంది. గత పదేళ్లుగా చేసిన అనేక తప్పుల్ని రేవంత్ రెడ్డి సర్కార్ వెలుగులోకి తెస్తోంది. తాజాగా .. అనధికారికంగా అధికారిక కేంద్రంలో చేసిన చేసిన ట్యాపింగ్ కుట్రల్ని కూడా బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చే అంశాలు సంచలనాత్మకంగా ఉంటాయన్న చర్చ ఉంది. ఇక హైదరాబాద్ లోని బడా రియల్ ఎస్టేట్ సంస్థల వ్యవహారాలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ అరెస్టు తర్వాత .. అలాంటి సామ్రాజ్యం కంపిస్తోంది. వీటన్నింటితో ఎలా చూసినా.. రేవంత్ సర్కార్ ఉండకూడదన్న ఉద్దేశంతోనే గట్టిగా ప్రయత్నిస్తున్నారని.. అది తెలిసే రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు.
రేవంత్ వార్నింగ్ ఇచ్చింది… కేవలం విపక్షాలకే కాదని.. అలాంటి ప్రయత్నాలు చేసే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అని అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తానని మాటల ద్వారానే గట్టి సందేశం పంపారని అనుకోవచ్చు.