జనసేన అధినేత పవన్ కల్యాణ్ – మీడియాపై ఆయన చేసిన వ్యాఖ్యలు – తదనంతర పరిణామాలు తెలిసినవే. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో మెగా ఫ్యామిలీ హంగామా తరువాత.. కొంతమంది అభిమానులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ కి చెందిన ఓబీ వ్యాను, ఇండికా కారుపై దాడి ఘటన కూడా తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదుచేశారు. అంతేకాదు, 14 రోజులపాటు రిమాండ్ కి కోర్టు ఆదేశించింది. ఈ ఘటనలో దెబ్బతిన్న మీడియా వాహనాలకు బీమా సౌకర్యం ఉంటుంది కాబట్టి, వారికి జరిగిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంది.
సరే, ఇదే విషయంపై మొన్ననే పవన్ స్పందించారు కదా! కుర్రాళ్లు కొంతమంది బయట వాహనాల అద్దాలు పగులగొట్టడం వంటివి చేస్తున్నారని తన దృష్టికి పోలీసులు తీసుకొచ్చారనీ, అయితే తానేం రెచ్చగొట్టలేదని పవన్ అన్నారు. వాళ్లని రెచ్చగొడుతున్నది కూడా మీడియేననీ, చాలారోజులుగా వాళ్లకు ఆగ్రహం తెప్పించే విధంగా మీడియా చేస్తోందనీ, కాబట్టి వాళ్లకి కోపం వస్తోందన్నట్టుగా విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈ విషయం మీడియాకి చెప్పండంటూ ఉల్టా క్లాస్ తీసుకున్నారు. అంటే, అభిమానం పేరుతో కొంతమంది చేస్తున్న పనులకు పవన్ మద్దతు ఉండదని చెప్పినట్టే కదా. ఈ విషయంలో వారికి అండగా నిలిచేదీ లేదని చెప్పినట్టు. చోటు చేసుకున్న ఘటనలపై కూడా స్పందించను అని చెప్పినట్టే కదా.
నిజానికి, పవన్ స్పందించే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే, ఈ ఘటనలో ఇరుక్కున్న అభిమానుల విషయమై పవన్ స్పందించి, సాయమందించే ప్రయత్నం నేరుగా చేస్తే… పరోక్షంగా మీడియాపై దాడి ఘటనకు మద్దతు పలికినట్టు అవుతుంది. అలాగని, తన కోసం నిలబడి, కలబడిన అభిమానుల కోసం పవన్ ఏం చేస్తున్నారంటే… ఏమో, తెర వెనుక వారికి మద్దతుగా నిలిచే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారో లేదో తెలీదు! అభిమానం పేరుతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే… వాటిపై బహిరంగంగా పవన్ స్పందించలేని పరిస్థితి ఉంది. వాహనాలపై దాడి ఘటనలో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లిన అభిమానులకు జనసేన సాయం ఉంటుందా, ఉండదా..?