ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించాలనుకుంటున్న విపక్ష వైసీపీ అందుకు వాడనున్న చిట్టచివరి బ్రహ్మస్త్రం అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర. దాదాపు 6 నెలల పాటు సాగనున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలు అందరికీ చేరువ కావాలని పార్టీ వ్యూహ కర్తలు భావిస్తున్నారు. యాత్ర ముగిసేటప్పటికి రాష్ట్రంలో వాతావరణం వేడెక్కుతుంది. ఎన్నికల కోలాహలం ఊపందుకుంటుంది. అంతా అనుకున్నట్టు సజావుగా జరిగితే, పాదయాత్రలో దక్కిన జనాదరణ, తెలుసుకున్న ప్రజల సమస్యలను అస్త్రాలుగా మలచుకుని ఎన్నికల సమరాంగణంలో గెలుపు గుర్రంలా బరిలోకి దూకాలని అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నారు.
ఆలోచనైతే బాగానే ఉంది కానీ… ఆచరణలో పలు చిక్కులు ఎదురవుతున్నాయి. అసలు ఈ పాదయాత్రను అక్టోబరు 27 అని ముందు అనుకుని దాన్ని తిరిగి నవంబరు 2కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ తేదీ అయినా ఖరారైనట్టేనా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాయి వైసీపీ శ్రేణులు.పాదయాత్ర చేయాలి కాబట్టి, వారం వారం హాజరు నుంచి మనహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ వేసిన పిటిషన్ పై ఇంకా కోర్టు తీర్పు పెండింగ్‌లో ఉంది. అదే అసలు సమస్య కాగా… మరోవైపు వచ్చే నెల స్వల్పకాలిక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పాదయాత్ర అనుకున్న తేదీకి ప్రారంభమైతే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేడు. అవేకాదు ఆ తర్వాత నిర్వహించే సమావేశాలకు కూడా డుమ్మా కోట్టాల్సిందే. ఇది వైసీపీకి పెద్ద విషయం కాదు గాని, ఆర్నెళ్ల పాటు సమావేశాలకు హాజరుకాని సభ్యునిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉండడం ఇక్కడ గమనార్హం.
మరోవైపు పాదయాత్ర ఓ నిత్య సంచలనాల సమ్మేళనంగా సాగాలని ఆశిస్తున్నారు వైసీపీ పెద్దలు. అది ఏ ఊరికి చేరినా, అన్ని ఊర్లకూ సమాచారం అందేలా భారీ ప్రచారం రావాలనేది ప్లాన్. అంతేకాకుండా వైసీపీలోకి రావాలని ఆశిస్తూ మీనమేషాలు లెక్కిస్తున్నవారిలో పూర్తి విశ్వాసం నింపి వారిని పెద్ద యెత్తున పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం కూడా యాత్రకు సమాంతరంగా సాగాలనీ అనుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి… అందులో నుంచి వైసీపీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు రావచ్చునని అంచనా ఉంది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పలువురు అసంత్రుప్తులను ఆకర్షించవచ్చునని, అంతేకాకుండా తటస్తులు కూడా వస్తారని భావిస్తున్నారు. నిజానికి నంద్యాల ఎన్నిక గెలిస్తే వైసీపీ వైపు ఈ వలసల పర్వం ఈ సరికే ప్రారంభం అయ్యేదంటున్నారు.
ఏదేమైనా… పాదయాత్రను భారీగా విజయవంతం చేసి నంద్యాల ఓటమి మచ్చని చెరిపేసుకోవడం కూడా ఓ తప్పనిసరి అవసరంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. యాత్ర ఆధారంగా వేసిన ప్లాన్స్‌లో ఏది సరిగా జరగకపోయినా…అది వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఆ మేరకు నష్టదాయకమే అని అనుకుంటున్న పార్టీ పెద్దలు, అనుకున్న తేదీకి యాత్ర ప్రారంభం కావడం కన్నా… అది అనుకున్నట్టుగా విజయవంతం కావడం ముఖ్యం అనే నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో… జగన్ పాదయాత్ర మరోసారి వాయిదా పడకపోతేనే ఆశ్చర్యపోవాలి.