వరుణ్‌తేజ్ కొత్త సినిమాకి ‘తొలి ప్రేమ’ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్‌ని మెగా ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అందులోనూ పవన్ అభిమానులు. పవన్‌ని యువతరానికి దగ్గర చేసిన సినిమా ఇది. ఇప్పుడు ఆ టైటిల్‌ని వాడుకోవడం వరుణ్‌తేజ్ తెలివైన ఎత్తుగడే. కాకపోతే… దాంతో పాటు రిస్కూ ఉంది. సూపర్ హిట్ సినిమాల టైటిళ్లు, కథలూ మళ్లీ వాడుకోవడం అనేది రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఇలా పాత టైటిళ్లని వాడుకున్న సినిమాలేవీ హిట్ అయిన దాఖలాలు లేవు. పైగా ఆ సినిమాని ఊహించుకొని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే అవకాశం ఉంది. ‘తొలి ప్రేమని ఊహించుకుని సినిమా చూస్తే ఏమవుతుంది?’ అని ఈ చిత్ర బృందం ఆలోచించలేకపోయింది.
జనాల్ని థియేటర్ వరకూ తీసుకురావడానికి ఈ టైటిళ్లు ఉపయోగపడతాయి. లోఫర్, మిస్టర్ సినిమాలతో కాస్త ఇబ్బంది పడిన వరుణ్ తేజ్…. `ఫిదా`తో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ దశలో వరుణ్ సినిమాపై అంచనాలు ఉండడం సహజం. దాన్ని పెంచుకోకుండా లో ప్రొఫైల్‌లో రావాల్సిన వరుణ్… ‘తొలి ప్రేమ’ లాంటి టైటిల్ ముట్టుకోవడం ఓ విధంగా సాహసమే. బహుశా చిత్రబృందానికి తమ కథపై, సినిమాపై విపరీతమైన నమ్మకం ఉండి ఉండాలి. లేదంటే.. కనీసం ‘తొలి ప్రేమ’ టైటిల్‌తో అయినా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలన్న వ్యూహం ఉండాలి. మరి ఈ ఎత్తుగడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.