ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాజ్యసభకు వెళ్లాలన్న ఆకాంక్షను చాలా సార్లు వెలిబుచ్చుతూ వచ్చారు. ఇంటర్వ్యూలలోనూ చెప్పారు. త్వరలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు రానుండగా ఆయన శిబిరంలో అలాటి హడావుడి కనిపించడం లేదు. దీనిపై తెలుగుదేశం వర్గాలు మాట్లాడుతూ యనమల మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. ఒకప్పుడు రాజ్యసభకువెళ్లి కేంద్ర మంత్రి కావాలని ఆయన కోరుకున్న మాట నిజమే అయినా ప్రధాని మోడీ వ్యక్తిగత శైలి చూసిన తర్వాత ఆలోచన మార్చుకున్నారని వారి కథనం. పైగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వుంటాయో స్పష్టంగా తెలియనప్పుడు కీలకమైన శాఖలను మంత్రివర్గంలో సీనియర్ స్థానాన్ని వదులుకోవడం మంచిది కాదనే ఆయన భావిస్తున్నారట. మూడో కారణం వుండనే వుంది- వచ్చే రెండు స్థానాల్లోనూ ఒకటి సుజనా చౌదరికి మరొకటి బిజెపి (వెంకయ్య నాయుడు/ నిర్మలా సీతారామన్) కి పోతాయి గనక తనకు ఎలాగూ అవకాశం దక్కదని కూడా ఆయన అనుకుంటున్నారట. వాణిజ్యపన్నులు శాఖను వదులుకోవడమెందుకనేది వీటన్నిటినీ మించిన వాస్తవిక కారణమని ఒక రాజకీయ పరిశీలకుడి ఉవాచ. అదే నిజమై వుంటుందా?అయినా యనమల అలాటి వారు కాదని పేరుందే!