2019 ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే ప్రచారం ముమ్మరంగా జరుగుతూ ఉంది. 2026 వరకు నిజానికి ఇలా జరగడానికి అవకాశం లేకపోయినా.. విభజన చట్టం ప్రకారం.. తెలుగురాష్ట్రాల్లో మాత్రం చేస్తారని అంతా అనుకుంటున్నారు. నిజానికి అన్ని పార్టీలూ దీనికోసం ఎదురుచూస్తున్నాయి. వైకాపా కూడా ఆసక్తిగానే ఉంది. ఎందుకంటే.. ఆపార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చాన్నాళ్ల కిందటే సీఈసీ వద్దకు వెళ్లి ఈ మేరకు విజ్ఞప్తి చేసివచ్చారు.
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల పెంపు అంటే అసహ్యించుకునే, 2019లోగా రాకపోతే మంచిదనుకునే స్థితిలో వైకాపా ఉన్నదని అనిపిస్తోంది. అంత స్పష్టంగా కాకపోయినా.. బుధవారం నాడు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌ను కలిసిన తర్వాత.. ఎంపీ మేకపాటి మాటలు కూడా దీన్ని ధ్రువపరుస్తున్నాయి. ఎందుకు వాళ్లు వద్దనుకుంటున్నారనడానికి కొన్ని జాలిగొలిపే కారణాలున్నాయి.
వివరాల్లోకి వెళితే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి ఎమ్మెల్యే స్థాయి నాయకులు తెలుగుదేశంలోకి ఫిరాయిస్తున్నప్పుడు.. ఆయా నియోజకవర్గాల్లోని అదే స్థాయి నాయకులు, కొన్ని దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని ఉన్నవారు అసహనానికి గురికావడం సహజం. అయితే ఇలాంటి కొత్తగా పుట్టే అసంతృప్తులు అన్నిటినీ చంద్రబాబునాయుడు.. నియోజకవర్గాల పునర్విభజన అనే తాయిలం చూపి బుజ్జగించేస్తున్నారు. కొత్త అసెంబ్లీ సీట్లు వస్తాయి.. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా.. అకామడేట్ చేస్తా అంటూ.. చంద్రబాబు అందరినీ ఊరడించేస్తున్నారు. దీనివల్ల.. వైకాపా చేరికలతో తెదేపాలో పెద్దగా ముసలం పుట్టడం లేదు. ఈ పోకడ వైఎస్సార్‌కాంగ్రెస్‌కు కంటగింపుగా ఉంది. 2019లోగా కొత్త అసెంబ్లీ సీట్లు రాకపోతే.. తెదేపా అసంతృప్తులతో రగిలిపోతుందని.. ఆ పార్టీకి చేటు జరుగుతుందని వారు ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
బుధవారం మేకపాటి ఢిల్లీలో రాజ్‌నాధ్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గాల పెంపు గురించి.. కేంద్రమంత్రి సంపూర్ణహామీ ఇవ్వలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఇందుకు నిదర్శనమే. వైకాపానుంచి ఇంకా వెళ్లదలచుకునే వారిలో ఒక భయాన్ని నాటడం ఈ మాటల పరమార్థం అనుకోవచ్చు. 2026 వరకు ఇది జరగదని అటార్నీ జనరల్ చెప్పినట్లుగా, సీఈసీ నసీం జైదీ తనకు తెలిపిన విషయాన్ని కూడా మేకపాటి గుర్తుచేశారు. చట్టసవరణ విషయం ఆయన ప్రస్తావించినప్పటికీ.. మాటల ధోరణి మాత్రం.. పునర్విభజన 2019లోగా జరగకపోతే.. తెదేపాకు నష్టం ఉంటుందని వైకాపా ఆశిస్తున్నట్లుంది.
అదే అంచనా నిజమైతే గనుక.. ఆ సాకు చూపి.. తన పార్టీలోని అసంతృప్తులు అందరినీ బుజ్జగిస్తూ వస్తున్న చంద్రబాబునాయుడు ఎలా నెగ్గుకు వస్తారో వేచిచూడాలి.