క్షేత్ర స్థాయిలో కరోనా వారియర్స్‌గా పని చేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతాధికారులు రుబాబు చేస్తున్న ఘటనలు తరచూ బయటపడుతున్నాయి. తీవ్ర ఒత్తిడిలో పని చేస్తున్న కరోనా వారియర్స్‌ను సరిగ్గా పని చేయడం లేదనే ఆరోపణలతో వేధింపులకు గురవుతున్నాయి. ఇలాంటి ఘటన గుంటూరులో జరిగింది. నరసరావుపేటలో కరోనా తీవ్రతపై కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది పనితీరు సరిగ్గా లేదని సమీక్షా సమావేశంలో శామ్యూల్ విమర్శలు అందుకున్నారు.
అయితే.. నాదెండ్ల వైద్యాధికారి సోమ్లా నాయక్ కలెక్టర్ తీరును ప్రశ్నించారు.
సౌకర్యాలు కల్పించకుండా… వైద్యులను నిందించడం ఏమిటని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో కష్టపడే తమపై ఇలా మాట్లాడటం సరికాదన్నారు. దీంతో.. కలెక్టర్‌ను అయిన తనను ఓ వైద్యాధికారి అలా ప్రశ్నించడం ఏమిటనుకున్నారో కానీ… సోమ్లా నాయక్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డీఎస్పీని ఆదేశించేశారు. ఎందుకు అరెస్ట్ చేయాలో తెలియక డీఎస్పీ కూడా గందరగోళానికి గురి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత సోమ్లా నాయక్‌ను సస్పెండ్ చేయాలని వైద్యశాఖ ఉన్నతాధికారులకు కలెక్టర్ అప్పుడే ఆదేశం జారీ చేసేశారు.
ఆయనను పోలీసులు బయటకు తీసుకెళ్లిపోయారు. అరెస్ట్ చేశారో లేదో క్లారిటీ లేదు. బహుశా..రేపో మాపో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు ఇవ్వొచ్చు. కలెక్టర్ తీరు… చర్చనీయాంశం అయింది. తాము ఉన్నతాధికారులం కాబట్టి… కింది స్థాయి ఉద్యోగాలు తాము మాటలు అన్నా పడాల్సిందేనని .. ఎదురు చెబితే అంతే సంగతులున్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చివరికి అధికారులు కూడా ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతున్నారు.