ప్రపంచ ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్శిటీలో సీటు రావడం కష్టం. అలాంటిది పిలిచి ఉద్యోగం ఇస్తానంటే మంచి ఆఫర్ అని గంతులేస్తారు. అదీ కూడా నేడు యాభై కోట్లకు సమానమైన నాటి రోజుల్లో రూ.కోటి ప్యాకేజీకి రమ్మంటే ఆలోచిస్తారా?. ఆయన కూడా ఆలోచించలేదు..వెంటనే తిరస్కరించారు. ఇండియాలోనే ఉన్నారు. ఇక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన కోసమే విదేశీ విద్యార్థులు వచ్చి పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆయనే డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి.
భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ఈ ఏడాది ఏడుగురికి ప్రకటించారు. అందులో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి స్థాపకుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఒకరు.
ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి అయిన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. విజయవాడలో ఇంటర్ పూర్తిచేశారు. కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్నారు. 2002 లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. చెన్నైలో ఇంటర్నల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, పీజీఏ చండీగఢ్‌లో డీఎం చేశారు. నిమ్స్‌లో పనిచేశారు. తర్వాత గాంధీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. తర్వాత ఏఐజీ ఆస్పత్రిని పెట్టారు.
2013 ప్రపంచ అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులుగా ఈయన ఎంపికయ్యారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఎండోస్కోపీ చికిత్సల్లో అనేక కొత్త విధానాలు వైద్య ప్రపంచానికి అందించారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల పరిశోధనల కోసం అత్యుత్తమ పరిశోధనాలయం ఏర్పాటు చేయడం, రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటివి చేశారు. ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హార్వర్డ్, హాంకాంగ్ తర్వాత మూడో స్థానంలో ఉంది.
నేరుగా ఆయన అందరికీ వైద్యం చేయలేకపోవచ్చు కానీ ఆయన ప్రవేశపెట్టిన పద్దతుల ద్వారా ఎంతో మందికి గ్యాస్ట్రో సమస్యలు తీరిపోయాయి. అందుకే ఆయన పద్మవిభూషణ్ కు అన్ని అర్హతలు ఉన్న గౌరవనీయ వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటున్నారు.