కరోనాపై టాలీవుడ్ మొత్తం యుద్ధం ప్రకటించింది. ఎవరికి తోచినట్టు వాళ్లు సహాయ సహకారాలు అందిస్తున్నారు. లక్షలు, కోట్లలో విరాళాలు ప్రకటిస్తున్నారు. పేద కార్మికులకు నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తున్నారు. నిఖిల్ తన వంతు ప్రయత్నంగా పర్సనల్ ప్రొటక్షన్ కిట్స్ అందించాడు. దాదాపు రూ. 10 లక్షల విలువైన 2 వేల ఎన్ 95 రెస్పిరేటర్లు, 2 వేల రీ యూజబుల్ గ్లవ్స్, 2 వేల ఐ ప్రొటక్షన్స్ గ్లాస్లులు, శానిటైజర్లు. పది వేల ఫేస్ మాస్కులూ విరాళంగా ఇచ్చాడు. ఇవన్నీ హైదరాబాద్ నగరంలోని వివిధ ఆసుపత్రులో పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి చేరిపోయాయి. విశేషం ఏమిటంటే ఇందులో కొన్ని కిట్స్.. ఇప్పటికీ చాలా ఆసుపత్రులలో వైద్యులకు అందుబాటులో లేవు. వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ కిట్స్‌ని సంపాదించడం, వాటిని వైద్యులకు అందించడం వెనుక నిఖిల్ శ్రమ మర్చిపోలేనిది. ఇంత అత్యవసరమైన పరిస్థితుల్లో ఇన్ని వేల కిట్స్ ఎలా సంపాదించాడో తెలీదు గానీ, కొంతమంది డాక్టర్లు నిఖిల్ కి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. తమిళనాడు, గుజరాత్ నుంచి కొంతమంది వైద్యులు నిఖిల్‌కి ఫోన్ చేసి, ఆ కిట్స్ ఎక్కడ దొరికాయి? మాకూ కొన్ని పంపగలరా? అంటూ ఆరా తీస్తున్నార్ట. మొత్తానికి నిఖిల్ క్లిష్టమైన పరిస్థితులలో చేయూత అందించాడు. వెల్ డన్ నిఖిల్.