హైదరాబాద్‌లో ప్రతీ రోజూ రూ. కోట్లలో నగదు పట్టుబడుతోంది. మూడ్రోజుల వ్యవధిలోనే సుమారు ఏడు కోట్ల రూపాయలకుపైగా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మునుగోడు ఉపఎన్నిక కోసమే వెళ్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే పట్టుబడుతున్న డబ్బంతా ఒకే పార్టీది. నగదు తరలింపుపై ప్రత్యేకంగా నిఘా పెట్టి మరీ సోదాలు చేసి నగదును పట్టుకుంటున్నారని చెబుతున్నారు.
గతంలో దుబ్బాక, హుజూరాబాద్ వంటి ఉపఎన్నికల్లో అదే జరిగింది. దుబ్బాక సమయంలో బీజేపీ అభ్యర్థికి చెందిన డబ్బు పదే పదే పట్టుబడింది. ఫోన్లు ట్యాప్ చేశారని రఘునందన్ ఆరోపించారు. ఇప్పుడూ బీజేపీ అభ్యర్థికి చెందిన సొమ్మే ఎక్కువగా పట్టుబడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో హవాలా వ్యాపారులపై నిఘా పెట్టడం.. ఆ నగదును పట్టుకోవడం కామన్‌గా మారిపోయిందంటున్నారు.
సాధారణంగా ఎన్నికలు వస్తే హవాలా వ్యాపారులకు పండగే. కమిషన్లు తీసుకుని ఎంత కావాలంటే అంత నగదును కావాల్సిన చోటకు తరలిస్తారు. ఇప్పుడు వారికి సీజన్ ప్రారంభమయిందని అనుకోవచ్చు. సాధారణంగా డబ్బును రవాణా చేసే వారికి పూర్తి వివరాలు తెలియదు. ఓ రకంగా చెప్పాలంటే వారు తీసుకెళ్తున్న బ్యాగుల్లో డబ్బులు ఉన్నాయని కూడా తెలియదు. సినిమాల తరహాలో ఎవరికి అందించాలో అందించేందుకు మాత్రమే వారుంటారు. ఒక వేళ ఆ డబ్బులెవరివో తెలిసినా పెద్దగా పట్టించుకోరు. డబ్బును సీజ్ చేయడం వరకే హైలెట్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.