జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆయన పర్యటన ఎజెండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడమే కాబట్టి.. ఈ అంశంపైనే ఆయన ప్రధానంగా చర్చించారు. స్టీల్ ప్లాంట్ …ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలా సెంటిమెంట్‌గా మారిందో వివరించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగానే చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వెంట… నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. కేంద్ర హోంమంత్రితో భేటీ కాబట్టి… రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. తిరుపతి ఉపఎన్నిక విషయంలో.. ఇంటలిజెన్స్ రిపోర్టులతో పాటు పంచాయతీ ఎన్నికలు.. ఏపీలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపైనా చర్చ జరిగినట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.
అమిత్ షాతో భేటీ అయ్యారన్న విషయం మాత్రమే.. ఫోటోల సహా జనసేన వర్గాలు అధికారికంగా మీడియాకు వెల్లడించాయి. ఇన్ సైడ్ ఏం జరిగిందో మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన పోటీ చేస్తేనే.. పోటీ ఇవ్వగలుగుతామన్న నివేదికను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అమిత్ షా స్పందనపై మాత్రం స్పష్టత లేదని తెలుస్తోంది. మరో వైపు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీలోనే ఉండి.. కొన్ని అంతర్గత సమావేశాల్లో పాల్గొనననున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు ఆరెస్సెస్‌కు చెందిన వ్యూహకర్తలు కొంత మందితో చర్చలు జరపనున్నారు. ఎన్నికల వ్యూహాలపై వీరు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
స్టీల్ ప్లాంట్ విషయంలో… ప్రైవేటీ కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా తాము చేసిన ఒత్తిడి ఫలిస్తుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌కు అవసరం అయితే అదనపు నిధులు సమకూర్చుతారు కానీ.. కొంత మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయబోరని ధీమాగా ఉన్నారు. ఇప్పటికే అమరావతి విషయంలో కేంద్రం విధానపరమైన నిర్ణయం… ఏపీ బీజేపీ ఉద్యమం వేర్వేరుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయాన్ని బీజేపీ పెద్దల వద్ద పవన్, నాదెండ్ల వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వెనక్కి తగ్గితే ఆ క్రెడిట్ పవన్ కల్యాణ్‌కూ దక్కుతుంది.