సాహిత్యం మీద ప్రేమ అభిమానం ఉన్న ఓ రచయిత సాధారణంగా మైకు పట్టుకొంటే `తెలుగు ఇంత గొప్పగా ఉంటుందా? భాషలో ఇంత సొగసు ఉంటుందా` అనిపిస్తుంటుంది. కానీ పోసాని కృష్ణమురళి పట్టుకొంటే మాత్రం పదాలు సిగ్గుపడతాయి. భాష బెదిరి పారిపోతుంది. అక్షరాలు వంకర్లు తిరిగి, పొర్లు దండాలు పెడతాయి. అలా ఉంటుంది ఆయన వాగ్ధాటి. రాజకీయాల కోసం ఇంత దిగజారిపోవాలా? అధికార మదం నెత్తి కెక్కితే – ప్రవర్తన ఇలా ఉంటుందా? అనిపిస్తుంటుంది పోసానిని చూస్తుంటే. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, మాటలు తక్కువ, బూతులు ఎక్కువ. ఎదుటివాడు ఎంతటివాడైనా తనకు నచ్చకపోతే బూతు పురాణం విప్పేస్తుంటారు. ఆయన్ని రచయితగానో, నటుడిగానో, దర్శకుడిగానో అభిమానించినవాళ్లు సైతం.. ‘ఇదెక్కడి పైత్యంరా బాబూ’ అని నెత్తీ నోరూ కొట్టుకొంటారు. ఇంతకంటే పోసాని వాక్పటిమ గురించి ఏం చెప్పగలం?
ప్రభుత్వాలు మారిన రోజు… పోసాని పాపం పండుతుందని అందరికీ తెలుసు. ఆరోజు వచ్చింది. పోసాని ఇప్పుడు చేసిన పాపాలకు బదులు చెప్పుకోవాల్సిన రోజు వచ్చింది. అలాంటి రోజున ఆయన వెనుక ఒక్కడంటే ఒక్కడూ లేడు. కనీసం `అయ్యో.. పోసానికి ఇలా జరిగిందేంటి` అని బాధ పడిన మనిషీ కనిపించడం లేదు. పోసానిని మీడియా ముందుకు పంపి, ఆ చోద్యం చూసి పైశాచిక ఆనందం పొందిన వాళ్లు సైతం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా తెరిస్తే చాలు.. గతంలో పోసాని వాడిన బూతులు బుసలు కొడుతున్నాయి. ‘ఇలాంటి వాడికి తగిన శాస్తి జరగాల్సిందే’ అనే నినాదాలు కోడై కూస్తున్నాయి. ఆఖరికి వైకాపా వాళ్లు కూడా ”పోసాని వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది. ఇప్పుడు కూడా అతన్ని సమర్థిస్తే మరింత మునిగిపోతాం” అంటూ ప్రత్యక్షంగానే కామెంట్లు విసురుతున్నారు. దీన్ని బట్టి పోసాని ఇప్పుడు పూర్తిగా ఒంటరివాడైపోయాడన్న భావన కలుగుతోంది.
అధికారం చేతికి రాగానే, ప్రతిపక్షాల మీద పడిపోండి. వాళ్లని తూర్పారపట్టండి. చేసిన తప్పుల్ని ఎత్తి చూపండి. ఫర్వాలేదు. ఎవరూ ఏమీ అనుకోరు. మైకు ఉంది కదా అని అమ్మల మీద, అక్కల మీద తిట్ల దండకం అందుకొంటే మాత్రం… ప్రతి పదానికీ, ప్రతీ అక్షరానికీ బదులు చెప్పాల్సి ఉంటుంది. అధికారం మారిన రోజున అంధకారమే కనిపిస్తుంది. ఆ చీకట్లో కలిసిపోవడం తప్ప – చెయ్యడానికి ఏం మిగలదు. పోసాని విషయంలో అదే జరుగుతోంది.