ఆంధ్రప్రదేశ్ కు డీజీపీ ఉన్నారా ? . ఏపీలో అరాచకం రాజ్యమేలుతూంటే.. పోలీసు వ్యవస్థ నిర్లిప్తంగా కనిపిస్తూంటే.. ఎవరికైనా ఇదే డౌట్ వస్తుంది. నిజానికి డీజీపీ ఉన్నారు. ఆయన పేరు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. కానీ విధి నిర్వహణలో ఆయనకు ఎలాంటి కసి ఉన్నట్లుగా కనిపించదు. ఎప్పుడూ ఆయన బయట కనిపించరు. ఫలానా చర్యలు తీసుకున్నారన్న స్పష్టతా ఉండదు.
ఎన్నికలకు ముందు లా అండ్ ఆర్డర్ ను పటిష్టంగా నిర్వహించిన పోలీసు వ్యవస్థకు ఆయన శల్యసారధ్యం చేస్తున్నారు. అసలు డీజీపీ విధులు ఆయన నిర్వహిస్తున్నారా ఆయన పేరుతో సలహాదారులు నిర్వహిస్తున్నారా అన్నదానిపైనా అనేక సందేహాలు ఉన్నాయి. మీడియాపై వరుస దాడులు జరుగుతూంటే.. పోలీసులు అడ్డుకోలేకపోవడం కాదు.. అసలు నిందితుల్ని పట్టుకోవడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి హింసకు ప్రేరేపిస్తూంటే.. చేతులు ముడుచుకుని కూర్చున్నారు.
డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డికి అర్హత లేదు. ఆయన పర్మినెంట్ డీజీపీ కాదు. ఆయన ఇంచార్జ్ డీజీపీ మాత్రమే. ఆయన కంటే పన్నెండు మంది సీనియర్లు ఉన్నారు. కానీ వారిని కాదని జగన్ రెడ్డి.. తమ వాడైన కసిరెడ్డిని అక్కున చేర్చుకున్నారు. ఆయన వ్యవస్థల్ని తన చేతకానితనంతో భ్రష్టుపట్టిస్తున్నారు. పోలీసు వ్యవస్థని రౌడీ మూకలకు అప్పగించేసినట్లుగా పరిస్థితి మారిపోతున్నాయి. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే.. ఎన్ని ప్రాణాలు బలి కావాల్సి వస్తుందోనన్న ఆందోళన సహజంగానే ప్రజల్లో ఉంది.