సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. తెలుగులో మరీ ఎక్కువ. ఏదైనా సెంటిమెంట్ నమ్మితే దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతారు. తమిళ దర్శకుల విషయంలోనూ తెలుగు హీరోలు, నిర్మాతలకు కొన్ని బలమైన సెంటిమెంట్స్ ఉన్నాయి. వాళ్లతో తెలుగులో తీసిన సినిమాలేవీ వర్కవుట్ కావన్నది ఓ బ్యాడ్ సెంటిమెంట్. అది చాలాసార్లు నిజమైంది. మురుగదాస్, లింగుస్వామి, శంకర్ లాంటి దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు తీశారు. అయితే అవన్నీ డిజాస్టర్లే. మురుగదాస్ మహేష్‌కు ‘స్పైడర్’ ఇస్తే, లింగుస్వామి రామ్ కోసం ‘వారియర్’ తీశాడు. ఇక శంకర్ – రామ్ చరణ్‌తో తీసిన `గేమ్ ఛేంజర్` గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ పీడ కలలే.
అందుకే కొంతమంది హీరోలు తమిళ దర్శకులంటే భయపడతారు. కానీ ఇంత భయంలోనూ అల్లు అర్జున్ ఇప్పుడు తమిళ దర్శకులతోనే పని చేస్తున్నాడు. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో ఓ సినిమా మొదలైంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. అట్లీ ట్రాక్ రికార్డ్ సూపర్బ్. ఈ విషయంలో తిరుగే లేదు. కానీ.. తెలుగు ప్రేక్షకులకు గత అనుభవాలు పీడకలగా మారాయి. వాళ్లేమో… తమిళ దర్శకులు తెలుగు హీరోల ఇమేజ్‌నీ, ఫ్యాన్ ఫాలోయింగ్ నీ అస్సలు అర్థం చేసుకోలేపోతున్నారని, అందుకే ఫ్లాప్స్ వస్తున్నాయని భయపడుతున్నారు. ఈ సెంటిమెంట్ మార్చాల్సిన బాధ్యత ఇప్పుడు అట్లీపై వుంది.
తమిళ దర్శకుల దగ్గర ఓ సమస్య ఏమిటంటే… వాళ్లు తెలుగు రచయితలతో, టెక్నీషియన్లతో పని చేయడానికి మక్కువ చూపించరు. దాంతో తెలుగు ప్రేక్షకుల పల్స్ సంపూర్ణంగా అర్థం కాని పరిస్థితి వచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ విషయంలోనూ ఈ తప్పు జరిగింది. ఈ సినిమాకు బుర్రా నరసింహా సంభాషణలు అందించారు. కాకపోతే.. ఆయన అనువాదకుడు మాత్రమే. తమిళ సీన్‌ని ఆయన తెలుగులో తర్జుమా చేశారు. దాంతో.. తెలుగు నేటివిటీ, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి పెద్దగా పట్టలేదు. ఇప్పుడు అట్లీ ఏం చేస్తాడో చూడాలి. ‘పుష్ప 2’ తరవాత చేస్తున్న సినిమా ఇది. కాబట్టి బన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే.