పవన్ కల్యాణ్ పై రెక్కీ నిర్వహించడం, ఆయన సెక్యూరిటీతో ఉద్దేశపూర్వకంగా గొడవ పడటం వంటివి చూస్తూంటే.. ఖచ్చితంగా ఏదో స్కెచ్ ఉందని జనసైనికులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. పార్టీ తరపున.. పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. పవన్ కల్యాణ్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖలు రాస్తున్నారు. పవన్ కల్యాణ్ భద్రత విషయంలో వారు ఇంతగా ఆందోళన చెందడానికి ఏపీలోని పరిస్థితులే కారణం. ఏపీలో టీడీపీ నేతల్ని పోలీసులు అర్థరాత్రి.. అపరాత్రి అని చూడకుండా గోడలు దూకి అరెస్ట్ చేసి తీసుకెళ్లి కొడుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్ కు కూడా పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన కసి ఉందని.. ఏదో ఓ తప్పుడు కేసు పెట్టి అర్థరాత్రి ఆరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలు, పోలీసులే పవన్ కల్యాణ్ వాహనంపైకి ఎక్కి రెచ్చొగట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనను విశాఖలో పర్యటించకుండా చేశారు. విశాఖ పంపేశారు. ఈ పరిణామాలన్నింటితో పవన్‌కు ప్రాణహాని ఉందన్న ఆందోళన ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే… తక్షణం కేంద్రం జోక్యం చేసుకోవాలని.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పవన్ పొత్తులో ఉన్నారు. కానీ ఆ పార్టీ పవన్ భద్రత గురించి కనీస మాత్రం కూడా స్పందించడం లేదు. ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని తేలిన తర్వాత … చర్యలు తీసుకోవాలని మొక్కుబడిగా ఓ ప్రకటనను సోము వీర్రాజు చేశారు. కానీ ఆయన సెక్యూరిటీపై కేంద్రంతో మాట్లాడుతామని హామీ ఇవ్వలేదు. దీంతో బీజేపీ నేతల తీరుపై జనసేన నేతల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది.