ఏక్ నాథ్ షిండేకు బీజేపీ మార్క్ రాజకీయాలు ఇప్పుడు బాగానే అర్థమవుతున్నాయి. ఆయనను ఆటలో అరటి పండులా తీసేస్తూండటంతో తాను గతంలో ప్రభుత్వాన్ని పడగొట్టాననే సంగతిని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఆయన హెచ్చరికలు చూసి.. చాలా పెద్ద వార్నింగే అని బీజేపీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు.
మహారాష్ట్రలో మహాయుతి పేరుతో కూటమిగా పోటీ చేసిన బీజేపీ.. చీలిక శివసేన, చీలిక ఎన్సీపీలు మంచి విజయాన్ని అందుకున్నాయి. బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోయినా.. ఆ దగ్గరకు వచ్చింది. షిండే నేతృత్వంలోని శివసేన మద్దతు లేకపోయినా…. ఎన్సీపీ అజిత్ పవార్ సాయంతో బండి నడిచిపోతుంది. అదీ కాదంటే.. షిండే వర్గం ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటారు..అదేమంత పెద్ద విషయం కాదు.
ఏక్ నాథ్ షిండే పరిస్థితి రాను రాను దుర్భరంగా మారుతోంది. శివసేనను చీల్చి రాగానే ఆయనకు బీజేపీ సీఎం పోస్టు ఇచ్చింది. ఫడ్నవీస్ ను డిప్యూటీ సీఎంను చేసింది. ఎన్నికల సమయంలో మా సీఎం అభ్యర్థి షిండే అనే ప్రచారం చేశారు. ఎన్నికలు అయిపోగానే.. ఫడ్నవీస్ ను సీఎంను చేశారు. షిండేను డిప్యూటీని చేశారు. కానీ ఆయనకు పవర్స్ లేవు. ఇంచార్జ్ మంత్రుల నియామకం తర్వాత ఆయన పూర్తిగా తనను నిర్వీర్యం చేస్తున్నారని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. కానీ అదెంత తప్పు పనో ఆయనకు త్వరలోనే బీజేపీ తెలిసి వచ్చేలా చేసే అవకాశం ఉంది.