ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అందరూ ప్రభుత్వానికి నొప్పి లేకుండా రాజకీయం చేద్దామనుకునేవారే. ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు… ఉద్యోగుల గురించి ఆలోచించకుండా జగన్ కు నొప్పి కలిగించారని తోటి ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణపై ఫైరయ్యారు. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తున్నారు. మరో ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు కూడా … మామూలు రోజుల్లో ప్రభుత్వానికి నొప్పి తెలియనివ్వరు. కానీ ఆదివారం వస్తే మాత్రం ఉద్యోగ సమస్యలపై మాట్లాడేస్తారు.
తాజాగా ఆయన ఫిబ్రవరి 5 లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఓ భారీ ప్రకటన చేసేశారు. ఇలా ఎందుకంటే.. త్వరలో ఆయన సంగం కర్నూలులో మహాసభలు నిర్వహించబోతున్నారు. దానికి ఉద్యోగులు రావాలి కదా.. అందుకే.. కొత్తగా ఈ వాదన వినిపించడం ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల దయ దక్షిణ్యాలతో తాము ప్రభుత్వ ఉద్యోగాలకు సంపాదించుకోలేదని కష్టపడి చదువుకొని పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించుకున్నామని .. చట్టపరంగా తమకు రావాల్సిన జీతభత్యాలు సమయానికి ఇవ్వాల్సిందేనని ఆయనంటున్నారు. ఇప్పుడు రోడ్డున పడ్డామని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని అన్నారు.
ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూసే దుస్థితికి ప్రభుత్వం చేరుకుందని విమర్శించారు. ఆఖరికి తాము దాచుకున్న డబ్బులు అడుగుతున్నా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ సమాచారం ఇచ్చినా ఇప్పటికీ డిపార్టుమెంట్లకు పంపలేదని అన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని అన్నారు. తమకు రావాల్సిన బకాయిలనే గౌరవంగా అడుగుతున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల్లో ఐక్యత ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ఐక్యత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాల్సిన ప్రతి సందర్భంలోనూ బయట పడుతున్న విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేస్తున్నారు.