నిర్మాత విష్ణు ఇందూరి – దర్శకుడు దేవా కట్ట మధ్య నాలుగు రోజుల కిందట.. సోషల్ మీడియాలో ప్రారంభమైన… వైఎస్ – చంద్రబాబు స్నేహం కథపై సినిమా వివాదం టీవీ చానళ్లకు ఎక్కింది. కరోనా వార్తలతో బుర్ర వేడెక్కిపోయిన టీవీ చానళ్లు ఇదేదో బాగుందని… ఈ వివాదాన్ని హైలెట్ చేసుకుంటున్నాయి. దర్శకుడు దేవా కట్ట.. ఖాళీగా ఉన్నారేమో కానీ.. టీవీ చానళ్లకు సమయం కేటాయించి తన వాదన వినిపిస్తున్నారు. చంద్రబాబు – వైఎస్ స్నేహంతో సినిమా, వెబ్ సిరీస్ అనేది తన కాన్సెప్ట్ అని.. దాన్ని విష్ణు ఇందూరి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ కూడా తన ఐడియానే అని దేవా కట్టా చెబుతున్నారు. 2010లోనే జానారెడ్డి కుమారుడితో కలిసి ..ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనుకున్నాం..కొన్ని కారణాలతో కుదరలేదని.. డేట్స్ కుదరకపోవడం..నేను అన్నకున్న రీతిలో కథ లేకపోవడం వల్ల..బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ తీయలేదని దేవా కట్టా చెబుతున్నారు. ఇదే విషయం విష్ణు ఇందూరి సమక్షంలో బాలకృష్ణకు చెప్పానంటున్నారు. అప్పట్లా.. ఇప్పుడు సైలెంట్‌గా ఉండనని కాపీ రైట్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు. విష్ణు ఇందూరి దేవా కట్టా వ్యాఖ్యలన్నింటినీ ఖండిస్తున్నారు. ఆయన ఐడియాలను క్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
అయితే.. వీరిద్దరి వివాదం.. పబ్లిసిటీ కోసమేనా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే.. చంద్రబాబు – వైఎస్ స్నేహంపై సినిమా తీసుకోవాలంటే … దేవా కట్టాకు మాత్రమే కాపీరైట్ ఉండదు. అందరికీ ఉంటుంది. దేవా కట్టా ప్రతిభావంతమైన దర్శకుడే. రాజకీయ సినిమాల్ని డీల్ చేయడంలో ఆయన “ప్రస్థానం” అందరికీ నచ్చుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి అదొక్కటే మిగిలింది. మళ్లీ హైప్ రావాలంటే.. ఏదో ఒకటిచేయాలి కాబట్టి.. ఈ వివాదాన్ని ప్రారంభించారన్న చర్చ కూడా నడుస్తోంది. కొన్ని రోజుల తర్వాత దేవా కట్టా దర్శకత్వంలోనే వైఎస్ – చంద్రబాబు స్నేహంపై సినిమా చేస్తున్నామని విష్ణు ఇందూరి ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. సినిమా ప్రపంచం అలాంటిదే మరి.