ఏపీ ప్రభుత్వం ఎప్పుడో 1983 నుంచి పేదలకు ఇచ్చిన ఇళ్లకు సంబంధించి ఉన్న రుణాలను ముక్కు పిండి వసూలు చేసుకోవడానికి వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అమలు చేసింది. అందరూ కడితే.. రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని.. రూ. లక్షల ఆస్తి వస్తుందని.. బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుంటే.. రూ. లక్షల అప్పు వస్తుందని ప్రచారం చేసింది. ఆ స్కీమ్‌కు డెడ్ లైన్ పెట్టి మరీ అమలు చేశారు. పెద్దగా స్పందన రావడంతో పొడిగించారు. తర్వాత ఇదో నిరంతరమైన ప్రక్రియ అన్నారు.
అయితే ఇప్పుడు ఓటీఎస్ స్కీమ్‌పై ప్రభుత్వం చప్పుడు చేయడం లేదు. ఎంత మేర జనం రుణాలను తీర్చారు.. ఎంత మందికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు.. ఎంత మందికి బ్యాంకుల నుంచి రుణాలు లభించాయన్నదానిపై ప్రభుత్వం ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. అన్నీ గోప్యంగా ఉంచారు. ఎప్పుడో ఇరవై , ముఫ్పై ఏళ్ల కింద తీసుకున్న రుణాలను మాఫీ చేయాల్సింది పోయి ఓటీఎస్ కింద వసూలు చేయడం కోసం రకరకాల ఆశలు చూపించారు. అప్పో సప్పో చేసి వాటిని కట్టిన పేదలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాల కోసం… రుణాల కోసం తిరుగుతున్నారు.
ప్రభుత్వం పేదల నుంచి కూడా వివిధ రకాల పద్దతుల్లో డబ్బులు వసూలు చేసేందుకు స్కీములు పెట్టింది. ప్రభుత్వానికి డబ్బులు కట్టడం అనే గొప్ప అవకాశం ఇస్తున్నామనిప్రచారం చేసుకుంది. అలా కడితే లక్షల ఆస్తి సొంత మవుతుందని ఆశలు కల్పించింది. కానీ టీడీపీ తాము వస్తే.. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పడంతో చాలా మంది ఆగిపోయారు. ఇప్పుడు ఆ స్కీమ్ పై ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది. ప్రభుత్వాన్ని నమ్మి డబ్బులు కట్టిన వారి పరిస్థితి మోసపోయినట్లయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.