లోక్ సభలో స్పీకర్ ఎన్నిక జరుగుతున్న తీరును చూసి వైసీపీ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మరీ ముఖ్యంగా జగన్. స్పీకర్ ఎన్నిక వరకు పార్టీల వారీగా ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా సరే ఎన్నికలో పాల్గొనటంతో పాటు స్పీకర్ కు ఇవ్వాల్సిన గౌరవం ఎలా ఇవ్వాలో లోక్ సభను చూస్తే అర్థం అవుతుంది.
ఏపీలో స్పీకర్ ఎన్నిక సమయంలో వైసీపీ ఏకంగా సభకు డుమ్మా కొట్టింది. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్న తాజా మాజీ ముఖ్యమంత్రి జగన్… స్పీకర్ ఎన్నికకు హుందాగా హాజరై, స్పీకర్ చైర్ లో కూర్చొనే వరకు తోడుగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ, జగన్ మాత్రం నాకేం సంబంధం అన్నట్లుగా దూరంగా ఉన్నారు.
కానీ, లోక్ సభ చూస్తే ఎంత హుందాగా ప్రతిపక్షం, పాలకపక్షంగా ఉండాలో అర్థమవుతుంది. పాలకపక్షం నుండి ఓంబిర్లా, విపక్ష కూటమి నుండి సురేష్ స్పీకర్ పదవికి పోటీపడ్డారు. ప్రొటెం స్పీకర్ ఎన్నిక నిర్వహించి, ఓంబిర్లా ఎన్నికైనట్లు ప్రకటించారు. అక్కడితో రాజకీయం అయిపోయింది.
అందుకే స్పీకర్ గా ఓంబిర్లా ఎన్నిక కాగానే… ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహరాల శాఖమంత్రి కిరణ్ రిజీజుతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓంబిర్లా కూర్చున్న చోటికి వెళ్లి, శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయం ప్రకారం ఓంబిర్లాకు తోడుగా స్పీకర్ చైర్ వరకు తోడ్కొని వెళ్లి శుభాకాంక్షాలు చెప్పి వచ్చారు. ఇదీ హుందాతనం… స్పీకర్ చైర్ కు ఇచ్చే విలువ.
కానీ ఏపీలో మాత్రం ఇది ఏమాత్రం కనపడలేదన్న అభిప్రాయం ఉంది. అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్ మారలేదన్న పెదవి విరుపు వినిపిస్తోంది.