తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేసినా దాని వెనుక లోతైన రాజకీయం ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. జల వివాదాలపై రెండు, మూడు రోజుల నుంచి వరుసగా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న కేసీఆర్ హఠాత్తుగా బీజేపీపై గురి పెట్టారు. ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. నేరుగా తెలంగాణ సర్కార్ విషయంలో అలాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పకపోయినా .. ఇటీవలి కాలంలో జరిగిన గోవా కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ , మహారాష్ట్ర వంటి రాష్ట్రల అంశాలను ఆయన ఉదహరించారు. మామూలుగా అయితే కేసీఆర్ వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ తెలంగాణలోనూ అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారన్న అర్థంలో కేసీఆర్ తాజాగా వ్యాఖ్యానించినట్లుగా సులువుగానే అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ కొత్త తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్‌ను జైలుకు పంపించే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆయన ఆషామాషీగా చేయడం లేదన్న రూఢీ సమాచారం కేసీఆర్‌కు అందినట్లుగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రాజెక్టుల గురించి కేంద్రం ఆరా తీస్తోంది. అయిన ఖర్చు ఇతర అంశాలపై వివరాలు అడుగుతోంది. కేసీఆర్ దోచుకున్నదంతా లెక్కలతో సహా బయటపెడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో కేసీఆర్ .. ప్రభుత్వాన్ని కూలదోసే బీజేపీ రాజకీయాలపై మాట్లాడటం.. ఖచ్చితంగా ఏదో ఉందన్న సంకేతాన్ని పంపడమేనని అంచనా వేస్తున్నారు.
కొద్ది వారాల కిందట.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ఆర్టికల్‌లోనూ.. ఈ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ నాయకులు.. సాదాసీదాగా కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేయడం లేదని.. అంతకు మించి ఉందని చెప్పుకొచ్చారు. అందుకే కేటీఆర్‌ను తెర ముందుకు తెస్తున్నారని.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ నజర్ పెట్టడానికి కూడా అదే కారణమని ఆర్కే చెప్పుకొచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి వస్తుందని బీజేపీ తనను టార్గెట్ చేసిందని చెప్పుకోవడానికి ఇలా చేస్తున్నారని ఆర్కే రాసుకొచ్చారు. ఒక్కొక్క పరిణామం.. ఇప్పుడు.. బీజేపీ వ్యూహాలను బయట పెడుతున్నట్లుగా ఉందన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.