తెలంగాణ రాష్ట్ర సమతిలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తెలంగాణ బీజేపీ నేతలు ఆపరేషన్ కమల్‌ను ప్రారంభించారని టీఆర్ఎస్లో బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఆ పార్టీలో అంతర్గతంగా కొంత మంది తమ పని ప్రారంభించారని.. చివరికి పెద్ద స్థాయిలో బ్లాస్ట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్కు ఈ అంశంలో సమాచారం సేకరించడానికి అవసరమైన బలం, బలగం ఉంది. అందుకే కొంత సమాచారం ఆయనకు ఉందని.. ఎంత మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారో ఎవరెవరు రెడీ అయ్యారో కూడా ఆయనకు తెలుసని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం టిక్కెట్లు ఖరారు చేయాలనుకుంటున్న కేసీఆర్ చాలా మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు. అదే సమయంలో వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ చాన్స్ లేదన్న సూచనలు కూడా పంపుతున్నారు. పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే లేదని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టిక్కెట్లు లభించే చాన్స్ లేని పాతిక మంది ఎమ్మెల్యేల వరకూ ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. వారంతా వెళ్లొచ్చని టీఆర్ఎస్ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.
బీజేపీ చేస్తున్న ఆపరేషన్ కమల్పైనా … కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకుంటున్న నేతల విషయంలోనూ కేసీఆర్‌కు క్లారిటీ ఉందని.. సమయం వచ్చినప్పుడు కౌంటర్ స్టార్ట్ చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కూడా బలపడినట్లుగా కనిపిస్తున్నందున పార్టీ నేతలకు ఆప్షన్లు పెరిగాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఆపరేషన్ కమల్ విషయంలో కేసీఆర్ ఓ స్పష్టమైన అవగాహనతో ఉన్నారని ఆయనేమీ ఆందోళన చెందడం లేదని టీఆర్ఎస్ నేతలు ఓ అంచనాకు వస్తున్నారు.