“హుజూరాబాద్ ఉపఎన్నిక అత్యంత చిన్న విషయమని.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే దాని గురించి ఆలోచిస్తామని… ఓడిపోతే ప్రభుత్వం కూలిపొయేది లేదంటూ” కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అనేక రకాల చర్చలకు కారణం అవుతున్నాయి. ఏ విధంగా చూసినా “అందని ద్రాక్ష పుల్లన ” అన్న చందంగా కేటీఆర్ మాటలున్నాయన్న అభిప్రాయం మాత్రం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.
హుజురాబాద్ గెలుపు కోసం తలకిందులుగా తపస్సు చేస్తున్నది నిజం కాదా..?
ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుండి హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ రాజకీయం ప్రారంభమైంది. అప్పట్నుంచి కేసీఆర్ ప్రతీ రోజూ హుజూరాబాద్ ఉపఎన్నికల గురించే ఆలోచిస్తున్నారు. చివరికి అభ్యర్థిని కూడా ప్రకటించారు. హరీష్ రావు సహా నియోజకవర్గాల ఇంచార్జీలందర్నీ రంగంలోకి దింపారు. ఇప్పటికీ కేసీఆర్ సమీక్షలు చేసి ఏం చేయాలో.. ఎలా చయాలో చెప్పి పంపుతున్నారు. చివరికి ఒక్క నియోజకవర్గంలో రూ. రెండు వేలకోట్లు పెట్టి దళిత బంధు పథకాన్ని అమలు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అంటే కేసీఆర్ పూర్తి స్థాయిలో మొత్తం చతురంగబలాలను రంగంలోకి దింపారు. ఇంత జరుగుతూంటే కేటీఆర్ మాత్రం ఇది చాలా చిన్న విషయమని… అసలు పట్టించుకోవడం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు.
హుజురాబాద్‌లో ఓడితే ప్రభుత్వం కూలదు కానీ “ఇక రాదు” అనే భావన ఏర్పడుతుందిగా..!?
కేటీఆర్ మాటలతో హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పరిస్థితిపై వ్యతిరేక ప్రచారం ప్రారంభమయింది. ఇంత చేస్తున్నా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పరిస్థితి బాగో లేదని అందుకే తమకు చిన్న విషయం అని చెప్పుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పైగా ఓడిపోతే ప్రభుత్వం కూలిపోదని.. ఇంకా రెండున్నరేళ్లు ఉంటుందని చెప్పుకొచ్చారు. కేటీఆర్‌కు గుర్తు లేదేమో 2023లోనే ముందస్తు ఎన్నికలు ఉన్నాయి. గట్టిగా ఏడాదిన్నర కూడా కేసీఆర్ ప్రభుత్వానికి సమయం లేదని గుర్తు చేస్తున్నారు. హుజురాబాద్ ఓడిపోతే ప్రభుత్వం కూలిపోదు కానీ.. కూలిపోవడానికి అవసరమైన ఓ రకమైన రాజకీయ పరిస్థితులు మాత్రం ఏర్పడటం ఖాయం. ఆ విషయం అందరు రాజకీయ నాయకలుకు తెలుసు . కానీ కేటీఆరే తనకు తెలియదన్నట్లుగా మాట్లాడటమే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. హుజూరాబాద్‌లో ఆశలు వదిలేసుకుంటున్న ఫలితమని అంటున్నారు.
ఒంటరి అవుతున్న ఈటలకు ధైర్యం ఇచ్చిన కేటీఆర్ మాటలు..!
సొంత కేడర్‌లోనూ కేటీఆర్ మాటలు అయోమయం సృష్టిస్తున్నారు. తాడో పేడో అన్నట్లుగా స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి హుజురాబాద్ ఉపఎన్నిక గురించి వ్యహాలు రచిస్తూంటే ఇప్పుడు గెలిస్తే వచ్చేది లేదు.. పొయ్యేది లేదని అనడం ఏమిటని.. అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి బాగో లేకనే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న అనుమానాల్లోకి వస్తున్నారు. వారిలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతోంది. విపక్షాలకు కేటీఆర్ మాటలు మరింత ధైర్యం ఇస్తున్నాయి.. ముఖ్యంగా ఈటల రాజేందర్ క్యాంప్‌ను ఆయన మాటలు మరింత ధైర్యాన్నిస్తున్నాయి. ఈటల ప్రధాన అనుచరులందర్నీ టీఆర్ఎస్లో చేర్చుకుంటున్న సమయంలో కేటీఆర్ మాటలు కాస్త తేడాగానే ఉన్నాయి. మొత్తానికి హుజురాబాద్ విషయంలో టీఆర్ఎస్ మాత్రం అంత కాన్ఫిడెంట్‌గా లేదని మరోసారి తేలిపోయింది.