ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస అప్రతిహత విజయ విహారానికి తాజా ఎన్నికలు చిన్న బ్రేక్ వేశాయి. సారు… కారు… పదహారు అనుకున్నారుగానీ… కారు అనుకున్నంత మైలేజ్ ఇవ్వలేకపోయింది. దీనికిగల కారణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించినట్టు సమాచారం. తెరాస ఓటమికి గురైన లోక్ సభ స్థానాల్లో ఏం జరిగింది..? ఆ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఏం చేశారు..? మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఎంపీ సెగ్మెంట్లలో తెరాస నాయకులు ఏరకంగా పని చేశారు..? ఇలా అన్ని కోణాల నుంచి లోతైన విశ్లేషణ చేసుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రాథమికంగా కేసీఆర్ కి తెలుస్తున్న సమాచారం ఏంటంటే… సొంత పార్టీ ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరే తెరాస ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోందట!
లోక్ సభ ఎన్నికల సమయంలోనే… తెరాస ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలది అని కేసీఆర్ చెప్పారు. అప్పటికే రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేంతా జీ హుజూర్ అనేశారు. అయితే, ఇక్కడే కేసీఆర్ లెక్క తప్పింది అనొచ్చు..! రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పడ్డాయంటే కారణం… సదరు అభ్యర్థుల గుణగణాలను చూసి మురిసిపోయి ప్రజలు ఆదరించింది కాదు కదా! నన్ను చూసి ఓట్లెయ్యండని కేసీఆర్ పిలుపునివ్వడంతోనే చాలామంది ఎమ్మెల్యేలు ఆ నీడలో గట్టెక్కారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే… చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనీ, స్థానికంగా ప్రజల్లో ఆదరణ లేదని తెలిసినా కూడా, వారికి మార్చే సాహసం చేయలేక యథాతథంగా సీట్లు ప్రకటించేశారు కేసీఆర్. ఆ తరువాత, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారమంతా తానే భుజాన వేసుకుని… కాంగ్రెస్ కూటమి గెలిస్తే పాలన పరాయివాళ్ల చేతిలోకి వెళ్తుందనే సెంటిమెంట్ తీసుకొచ్చి గట్టెక్కారు.
లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి… ఎంపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలకు ఇచ్చారు. కానీ, ఎప్పట్నుంచో విముఖత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు రంగంలోకి దిగేసరికి… ప్రజల నుంచి సహజంగానే కొంత నెగెటివ్ రెస్పాన్స్ వస్తుంది. తెరాస ఓటమికి అదే కారణంగా నిలిచింది. పైగా, కొంతమంది తెరాస ఎమ్మెల్యేలు… ఎంపీ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోలేదనే అంశం కూడా ఇప్పుడు కేసీఆర్ దృష్టికి వెళ్లిందట! కోమటిరెడ్డి గెలుపునకు కొందరు ఎమ్మెల్యేలే సహకరించారనే కథనాలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. సీఎం కుమార్తె కవిత ఓటమికి కూడా కొందరు తెరాస ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరే కారణమనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. అంటే, కేసీఆర్ చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు నడుచుకోవడం లేదనేగా అర్థం! సొంత పార్టీలో మొదలైన ఈ సహాయ నిరాకరణ ధోరణిని తన సహజ శైలితో డీల్ చేస్తారా, లేదంటే… చిన్నగా మొదలైన ఈ ధిక్కార ధోరణులను ముందస్తు మేలుకొలుపుగా గ్రహించి వ్యూహాత్మకంగా అడుగులేస్తారా అనేది చూడాలి.