రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. వాటిని పట్టుకొని కూర్చుంటే రాజకీయాలు చేయలేం. లీడర్లు కూడా అదే పంథాను అనుసరిస్తుంటారు. వాటిని అస్సలు పరిగణనలోకి తీసుకోరు. కానీ, మోడీ తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను విపక్షాలు 101తిట్లు తిట్టాయని చెప్పుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆయన ఏ ఉద్దేశంతో వీటిని బయటపెట్టారో కానీ , తిట్లను కూడా బీజేపీ నేతలు లెక్కేసుకుంటున్నారా అని ప్రధాని వ్యాఖ్యలతో చర్చ మొదలైంది.
తనను 101తిట్లు తిట్టారని, అది తమ పార్టీ ఒకరు లెక్కించి చెప్పారని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ చెప్పుకొచ్చారు. వరుస ఓటములతో తనను తిట్టిపోయడాన్ని విపక్షాలు ఎజెండాగా పెట్టుకున్నాయని.. అలా తనను వందకుపైగా తిట్లు తిట్టారన్నారు మోడీ. మరో మూడు రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో సానుభూతి కోసమే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారా అనే కోణంలో చర్చ జరుగుతోంది.
మోడీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే రాజకీయపరమైన అంశాలను వదిలేసి సానుభూతి కోసం తిట్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. ఇన్నాళ్ళు కాంగ్రెస్ కూటమిపై రాజకీయంగానే యుద్ధం చేసిన మోడీ ఆల్ ఆఫ్ సడెన్ గా సానుభూతి కోరుకునేలా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
కొద్ది రోజులుగా మోడీ ప్రసంగాల్లో తేడా కనిపిస్తుంది అన్న విశ్లేషణల నేపథ్యంలో తనను విపక్షాలు 101సార్లు తిట్టాయని మోడీ చెప్పుకోవడం పట్ల నిజంగానే ఈ ఎన్నికల్లో బీజేపీపై వెనకబడిండా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.