ప్రపంచ క్రికెట్లో ధోనీ అత్యుత్తమ ఫినిషర్. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడు. చేజారిపోయాయి అనుకున్న మ్యాచ్‌లను రక్షించగలడు. అలాంటి ధోనీ ఇప్పుడు బ్యాటింగ్ కి రావాలంటే భయపడుతున్నాడా? వీలైనంతగా బ్యాటింగ్‌కి దూరంగా ఉండాలనుకుంటున్నాడా? ఐపీఎల్ లో ధోనీ ఆలోచనా విధానం చూస్తుంటే, అదే నిజం అనిపిస్తోంది.
ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో ధోనీ ఆలస్యంగా బ్యాటింగ్ కి వచ్చాడు. అప్పుడు మ్యాచ్ పూర్తిగా చెన్నై చేతిలోకి వచ్చేసింది. కాబట్టి ధోనీ చేయడానికి ఏం లేదు. మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ అంతే. ధోనీ 7వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. అప్పటికి మ్యాచ్ పూర్తిగా.. రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లింది. 15వ ఓవర్లోనే ధోనీ బ్యాటింగ్ కి వచ్చినా… ఎక్కువ స్ట్రైకింగ్ డూప్లెసీకే ఇచ్చాడు. సింగిల్స్ తీస్తూ.. జిడ్డు ఆడేశాడు. అప్పటికే ఛేదించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడం, ధోనీ సింగిల్స్ కే పరిమితం అవ్వడం.. అభిమానుల్లో అసహనం రేకెత్తించింది. మ్యాచ్ పూర్తిగా రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లాక, చెన్నై గెలవడం అసాధ్యం అని తెలిశాక ధోనీ మూడు సిక్సర్లు బాదాడు. `ఈ బ్యాటింగ్ ఏదో ముందు చేయొచ్చు కదా` అన్నది అభిమానుల ఫీలింగ్.
గవస్కర్ కూడా.. ధోనీ ఆలస్యంగా బ్యాటింగ్‌కి రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ధోనీ లాంటి బ్యాట్స్‌మెన్ ఎక్కువ బంతులు ఆడాలని, ఇలాంటి భారీ లక్ష్యాలు ఛేధించాల్సివచ్చినప్పుడైనా తను ముందుకు రావాలని సూచించాడు. తనకంటే ముందు ఆల్‌రౌండర్లని పంపి ప్రయోగాలు చేయడం మానుకోవాలని హితవు పలికాడు. . అయితే ధోనీ మాత్రం `అవి ప్రయోగాలు కాదు.. మాకు సన్నద్ధత లేదు` అంటూ నిజం ఒప్పుకున్నాడు. బ్యాటు పట్టి, మ్యాచ్‌లు ఆడి చాలా కాలం అయ్యిందని, ప్రాక్టీస్ లేకపోవడం వల్లే బ్యాటింగ్ఆర్డర్లో వెనక్కి వస్తున్నానని ఒప్పుకున్నాడు. నిజానికి ఐపీఎల్ కోసం ధోనీ బాగానే సన్నద్ధమయ్యాడు. అందరి కంటే ముందు ప్రాక్టీస్ మొదలెట్టాడు. కానీ… బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాల్సిన సందర్భాల్లోనూ వెనకడుగు వేస్తున్నాడు. రానున్న మ్యాచ్‌లలో అయినా.. ధోనీ నుంచి మెరుపులు చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ధోనీ ఏం చేస్తాడో?