నరేష్ ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరవాత `మా`లో రాజకీయాలు వేడెక్కాయి, ఇది వరకెప్పుడూ చూడని గ్రూపు రాజకీయాలు కనిపించాయి. బహిరంగంగానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. నిధుల గోల్ మాల్ కూడా తెరపైకి వచ్చింది. ఇవన్నీ అధ్యక్షుడి పీఠాన్ని కదిలించేంతగా మారిపోయాయి. మా అధ్యక్షుడి బాధ్యతల నుంచి నరేష్ తప్పుకుంటారని ప్రచారం జరిగింది. లోలోపల ఏం జరిగిందో తెలీదు గానీ, కొన్నాళ్లు నరేష్ ‘మా’కి దూరమయ్యారు. 40 రోజుల పాటు లాంగ్ లీవ్ తీసుకున్నారు. ఆ స్థానంలో బెనర్జీ వచ్చి చేరారు. ఇక నరేష్ మాకి శాశ్వతంగా దూరమయ్యారన్న ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్టుగానే నరేష్ అలికిడి చేయలేదు.
ఇప్పుడు సడన్‌గా నరేష్ ‘మా’లో కనిపిస్తున్నారు. ‘మా’ విషయాలలో ఇదివరకటిలానే చురుగ్గా స్పందిస్తున్నారు. `మా` అధ్యక్షుడి బాధ్యతలు ఆయన మళ్లీ భుజాన వేసుకున్నారు. గత వివాదాలన్నీ పక్కన పెట్టి ‘మా’ పనిచేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే, నాలుగ్గోడల మధ్య పరిష్కరించుకోవాలని సినీ పెద్దలు ‘మా’కి సూచించార్ట. నరేష్ విషయంలో సినీ పెద్దలు కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సొంత నిర్ణయాలు తీసుకోవద్దని, అందరినీ కలిసి, చర్చించే ఏ నిర్ణయమైనా తీసుకోమని పెద్దలు సూచించార్ట. నరేష్‌తో `మా` అసలు సమస్య ఇదే. ఆయన ఏక పక్ష ధోరణి నచ్చకపోవడం వల్లే లుకలుకలు మొదలయ్యాయి. ఈ విషయంలో నరేష్ మారాలని పెద్దలు సూచించారని, వాటన్నింటికీ నరేష్ ఒప్పుకోవడం వల్ల.. పరిస్థితులు సద్దుమణిగాయని చెబుతున్నారు. అసలే చిత్రసీమ కరోనాతో అల్లాడుతోంది. ఈ సమయంలో సొంతింట్లోనే గొడవలు మంచిది కాదని ‘మా’ కూడా భావిస్తోంది. అందుకే నరేష్‌తో రాజీ పడిపోయిందని తెలుస్తోంది.