పవన్ కల్యాణ్. ఓ కథానాయకుడిగానే కాదు. చదువరిగానూ తెలుగువారందరికీ తెలుసు. ఆయన సెట్లో సైతం పుస్తకం పట్టుకునే కనిపిస్తారు. ఇంటర్వ్యూలలో పుస్తకాల గురించే మాట్లాడతారు. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన `ఆధునిక మహా భారతం` పుస్తకాన్ని ఆయన స్వ ఖర్చుతో ప్రచురించారు. అయితే ఆయనకు శ్రీ/శ్రీశ్రీ అంటే తెలీదా? అనే అనుమానం వేస్తోందిప్పుడు.
తెలుగువాళ్లు గర్వించే కవి శ్రీశ్రీ. ఈ శతాబ్దం నాది అని గర్వంగాచాటుకున్నాడు. నిజమే.. శ్రీశ్రీ లాంటి కవి ఈ వందేళ్లలో పుట్టలేదు కూడా. వేల పుస్తకాలు చదివిన పవన్‌కి శ్రీశ్రీ తెలియకపోవడం విడ్డూరం. ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే..
శనివారం పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ మధ్య శ్రీశ్రీ గురించిన చర్చ, ఆయన పుస్తకాలకు, కవిత్వానికి సంబంధించిన కబుర్లు జరిగాయి. శ్రీశ్రీ దస్తూరితో ఉన్న మహా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ ని త్రివిక్రమ్ పవన్ కి బహుకరించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ గురించి అద్భుతంగా మాట్లాడారు త్రివిక్రమ్. అయితే ఆ పుస్తకాన్ని చూస్తూ… ఓ ఫొటో దగ్గర ఆగి `ఈయన శ్రీశ్రీనా` అని అడిగారు పవన్. కానీ అది శ్రీశ్రీ ఫొటోకాదు. ఆయన మిత్రుడు కొంపెల్ల జనార్థన్ ది. శ్రీశ్రీ తన పుస్తకాన్ని ఆయనకే అంకితం ఇచ్చాడు. అందుకే తొలి పేజీల్లో కొంపెల్ల ఫొటో కనిపించింది. ఈ విషయాన్నే త్రివిక్రమ్ కూడా పవన్ కి వివరించారు. శ్రీశ్రీ రూపం ఎలాంటిదో ఇన్ని పుస్తకాలు చదివిన పవన్ కి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా కవర్ పేజీపై శ్రీశ్రీ బొమ్మే ముద్రించారు. అది చూసైనా లోపలున్నది శ్రీశ్రీ కాదన్న విషయాన్ని పవన్ ఈజీగా గ్రహించగలగాలి. మరెవరినో పట్టుకుని శ్రీశ్రీనా అడగడం ఏమిటి? వేల పుస్తకాలు చదివిన వాళ్లకు తెలుగు కవులంతా తెలియాలని రూలేం లేదు. కాకపోతే తెలుగు జాతి గర్వించదగిన వాళ్లైనా తెలియాలి కదా?