బీఆర్ఎస్ హయాంలో ధరణిని తెచ్చి చేసిన భూముల గోల్ మాల్ వ్యవహారంలో అది పెద్ద స్కామ్ బద్దలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఐటీ కారిడార్ సమీపంలో 270 ఎకరాలను అతి సునాయసంగా కొట్టేసిన వైనం ఇప్పుడు సంచలనం రేపుతోంది. సూట్ కేసు కంపెనీలను పెట్టి ఆ కంపెనీల పేరు మీదుగా భూముల్ని బదలాయించుకున్నారు. తర్వాత వాటిని మరో రియల్ ఎస్టేట్ కంపెనీ దక్కించుకుంది. ఈ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు అందడంతో అంతర్గతంగా వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఓ సొసైటీ కొనుగోలు చేసిన భూముల్ని ధరణి సాయంతో కబ్జా
గండిపేట సమీపంలో 40 ఏళ్ల కిందట ఓ సొసైటీగా ఏర్పడిన కొందరు 450కిపైగా ఎకరాలను కొనుగోలు చేసుకున్నారు. ఆ సొసైటీలో మూడు వేల మందికిపైగా సభ్యులు ఉన్నారు. ప్లాట్లుగా మార్చుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు 111 జీవో కారణంగా ముందుకు సాగలేదు. ఈ నలభై ఏళ్లలో ఆ భూముల చుట్టూ ఐటీ కారిడార్ అభివృద్ధి చెందింది. 2014లో ఆ భూముల్ని ప్లాట్లుగా విభజించాలని రెవిన్యూ శాఖకు దరఖాస్తు చేస్తే మళ్లీ తిరస్కరించారు. కోర్టుకు వెళ్లిన సొసైటీ అనుకూలంగా తీర్పు తెచ్చుకుంది. అయినా అధికారులు దాన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చారు.
షెల్ కంపెనీలు పెట్టి కొనుగోలు – ఈడీ చేతికి ఆధారాలు
కానీ ఇక్కడే అతి పెద్ద గోల్ మాల్ జరిగింది. ప్రభుత్వం ధరణిని ప్రవేశ పెట్టాక ఈ భూమి సొసైటీ వారి పేరు మీద కాకుండా పాత యజమానిపేరుపై చూపించింది. వెంటనే కొంత మంది పాత యజమానితో ఒప్పందం చేసుకున్నారు. తర్వతా షెల్ కంపెనీలకు అమ్మేసినట్లుగా లావాదేవీలు నిర్వహించారు. తర్వాత నిషేధిత జాబితా నుంచి తప్పించారు. వెంటనే షెల్ కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వ్యవహారం అంతా ధరణిని తన గుప్పిట్లో పెట్టుకున్న ఐఏఎస్ అధికారి .. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ఓ కీలక నేత కనుసన్నల్లో జరిగినట్లుగా అనుమానాలు ఉన్నాయి. మొత్తం 450 ఎకరాల్లో 270 ఎకరాలు చేతులు మారినట్లుగా అనుమానిస్తున్నారు.
ఓ ఐఏఎస్.. మరో ఇప్పటి ప్రతిపక్ష పార్టీ కీలక నేత పాత్ర ?
ఈ వ్యవహారంపై ఈడీ ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించింది. మొత్తం గోల్ మాల్‌పై స్పష్టమైన ఆధారాలు లభించాయని కేసులు పెట్టి అరెస్టులు చేయడమే మిగిలి ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారికి సమాచారం అందింది. భూములు కొట్టేసిన షెల్ కంపెనీల్లో ఐఏఎస్‌కు కూడా పెట్టుబడులు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. పొంగులేటి చెప్పిన బాంబుల్లో ఇదే అతి పెద్ద ఆటంబాంబు కావొచ్చన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.