వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ అనే కుర్రాడ్ని పోలీసులు అరెస్ట్ చేసి.. ఆయన గొప్ప వివరాలు చెబుతున్నారంటూ ఆయుధాల కోసం వెదుకుతున్నారు. కానీ దొరకడం లేదు. కానీ సునీల్ యాదవ్ కుటుంబసభ్యులు మాత్రం… సీబీఐకి అనేక ప్రశ్నలు వేస్తున్నారు. కేవలం… ఆ కేసులో ఇరికించి పెద్దలను రక్షించడానికే తమ కుటుంబసభ్యుడ్ని అరెస్ట్ చేసి… వేదిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి వారు సంధిస్తున్న ప్రశ్నలు.. సందేహాలు ఎంతో మందికి వచ్చేవే. కానీ వారి కుటుంబసభ్యుడే టార్గెట్ అయ్యారు కాబట్టి ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. వాచ్మెన్ రంగన్న రెండున్నరేళ్ల పాటు ఏమీ చెప్పకుండా హఠాత్తుగా సునీల్ యాదవ్ పేరు చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సునీల్ యాదవ్.. వైఎస్ వివేకాకు అనుచరుడిగా ఉన్నా.. ఆయనను చంపాల్సిన అవసరం ఆయనకేమిటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకాను చంపినదెవరో సీఎం జగన్కు తెలుసని.. వారు స్పష్టం చేస్తున్నారు.
వివేకా హత్య కేసు విషయంలో సామాన్య ప్రజలకు వస్తున్న సందేహాలు కూడా సీబీఐ దర్యాప్తు బృందానికి రావడం లేదు. వైఎస్ కుటుంబానికి పులివెందులలో ఎదురుపడే వారు లేరు. అదీ వారింటికి వెళ్లి ఆయనను హత్య చేసేంత పరిస్థితి కూడా లేదు. ఒక వేళ అలా హత్య చేసినా.. దాడి చేసినా.. వారెవరి ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. వైఎస్ వివేకాను హత్య చేయాలంటే వైఎస్ ఫ్యామిలీ కంటే పవర్ ఫుల్ వ్యక్తులే అయి ఉండాలి. కానీ అలాంటి వారు పులివెందులలో లేరు. వైఎస్ కుటుంబసభ్యుడిపై ఎవరైనా దాడి చేసి పులివెందులో ప్రాణాలతో ఎలా ఉండగలరని.. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సూటిగా ప్రశ్నించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
వివేకా హత్య కేసు విషయంలో దర్యాప్తు చేయాల్సిన దిశలో చేస్తే… నిందితుల్ని పట్టుకోవడం చాలా సులువు అని నేర పరిశోధనలో ఓనమాలు తెలిసిన వారికీ ఓ అంచనా ఉంది కానీ ఏపీలో మాత్రం సిట్లు వేసినా.. సీబీఐ వచ్చినా వారి దర్యాప్తు కోణం మాత్రం వేరే ఉంది. పెద్దల్ని రక్షించి. .ఎవరో ఒకరిని బుక్ చేసి.. కేసుకు ఓ ముగింపు ఇవ్వాలన్న ఆత్రుత మాత్రమే దర్యాప్తు సంస్థల్లో కనిపిస్తోందని విమర్శలు రావడానికి ఇదే కారణంగా భావిస్తున్నారు. నిందితుల్ని తప్పించి.. అమాయకుల్ని బలి చేస్తున్నారని.. ఇప్పుడు సునీల్ యాదవ్ తల్లిదండ్రులు కూడా సీన్లోకి వచ్చారు. వారు వ్యక్తం చేస్తున్న సందేహాలకు సీబీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే హత్యను పోస్ట్ మార్టం అయ్యే వరకూ సహజమరణంగా చిత్రీకరించిన కుట్ర ఇంకా ప్రజల కళ్ల ముందే ఉంది మరి..!