కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్‌ను హిందూపురం సీఐ కొట్టడంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఎంత ధైర్యం అంటూ.. మండిపడింది. ఆయనపై కోర్టు ధిక్కరణ కేసులు పెట్టాలని నిర్ణయించంది. అంత వరకూ బాగానే ఉన్నా… ఎంత ధైర్యం అంటూ.. చేసిన వ్యాఖ్యలోనే చాలా పరమార్థం ఉంది. ఏపీలో పోలీసులు ఆ ధైర్యం .. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా ఏమీ కాదనే భరోసా ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. ఆ విషయం పక్కన పెడితే.. న్యాయవ్యవస్థకే తప్పని పోలీసు హింస.. ఇక సామాన్య ప్రజల విషయంలో ఎలా ఉంటుందో.. ప్రజల హక్కులు కాపాడాల్సిన న్యాయవ్యవస్థ గుర్తిస్తుందా ?
నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎన్ని వేల అక్రమ అరెస్టులు జరిగాయో లెక్కలేదు. ఇలాంటి అక్రమ అరెస్టుల విషయంలో కోర్టులు ఎంతమందిని రక్షించాయన్నదే సందేహాస్పదం. చిన్నచిన్న కేసుల్లో నోటీసులు కూడా లేకుండా అర్థరాత్రి ఇళ్లపై పడి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేశారు. ఇలా అరెస్టులు చేయడం తప్పని కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కానీ ఇలా అరెస్టులు చేసి మానవహక్కులు ఉల్లంఘించిన వారిపై న్యాయవ్యవస్థ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది. ఓ సోషల్ మీడియా కేసులోఓ వ్యక్తిని అరెస్ట్ చేసి అతను స్వలింగ సంపర్కుడనే ఓ ప్రచారాన్ని పోలీసులు చేశారు. ఇంత నీచానికి దిగబడిన పోలీసులపై ఏ చర్యలూ లేవు. మరి వారు రెచ్చిపోకుండా ఉంటారా >
ఏపీలో సంచలనం సృష్టించిన ఎన్నో ఘటనలను తీసుకుంటే… వాటిలో కెమెరా కళ్ల ముంద కనిపించే వారు నిందితులు కాదు. బాధితులే నిందితులయ్యారు. అంటేనే పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ విషయం చాలా స్పష్టంగా న్యాయస్థానాల ముందు ఉంది. కానీ న్యాయవ్యవస్థ కూడా ఎవరి హక్కులనూ కాపాడలేని స్థితికి వెళ్లిపోయిందన్న అవేదన ప్రజల్లో పెిగిపోయింది.
ఊరు చివర నిప్పు అంటుకుంటే.. మన దాకా రాలేదులే అని సంబర పడితే.. ఇవాళ కాకపోతే రేపైనా మన ఇంటిని దహించి వేస్తుంది.దాన్ని మొదట్లోనే ఆర్పేయాలి. లేకపోతే బూడితే మిగులుతుంది. ఇప్పుడు న్యాయవ్యవస్థ.. ఎంత ధైర్యం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినా చేసేదేమీ ఉండదు. రేపు ఆ సీఐకి ప్రమోషన్ ఇస్తారు. మరికొంత మందికిప్రోత్సాహం లభిస్తుంది. ఎందుకంటే పాలకుడి మైండ్ సెట్ అలాంటిది. కట్టడి చేయలేని వ్యవస్థల పతనం చూస్తోంది ఏపీ.