వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ ఈ సారి రెన్యూవల్ కావడం లేదని తొలి సంకేతాన్ని సీఎం జగన్ ఇచ్చారు. ఆయనను వైసీపీ అన్ని అనుబంధ సంస్థలకు ఇంచార్జ్‌గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనుబంధ సంస్థలు అంటే వైసీపీ యువత.. మహిళ.. కార్మిక.. సోషల్ మీడియా ఇలా అన్ని విభాగాలు వస్తాయన్నమాట.
వీటన్నింటిని చూసుకోవాలని ఇక పదవి లేదని జగన్ డైరక్ట్‌గా చెప్పేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే జూన్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో ఎవరెవరికి చాన్సివ్వాలన్న దానిపై జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. పదవి కాలం పూర్తవుతున్న రాజ్యసభ సభ్యుల్లో విజయసాయిరెడ్డి కూడాఉన్నారు. ఆయన వైసీపీకి.., జగన్‌కు అత్యంత ముఖ్యమైన వ్యక్తి.
కానీ మారుతున్న రాజకీయం కారణంగా ఆయనను పక్కన పెట్టాలని .. జగన్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు . పార్టీ పనికే పరిమితం చేయాలని నిర్ణయించడంతో ఈ మేరకు పదవి ప్రకటించారని అంటున్నారు. అయితే రాజ్యసభ ఇచ్చినా ఇవ్వకపోయినా విజయసాయిరెడ్డి ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేసేపరిస్థితి లేదు. జగన్ ఎలా అంటే అలా పని చేసుకుంటూ వెళ్లాల్సిందేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.