తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌తో కలిసి రాజకీయం చేస్తున్నానని.. జగన్మోహన్ రెడ్డి మొదటి సారి అంగీకరించారు. చాలా రోజులుగా.. టీఆర్ఎస్ తో కలిసి వైసీపీ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోందని… ఈ క్రమంలోనే ఏపీలో రాజకీయ పరిణామాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులు వైసీపీలో చేరడం.. టీడీపీ అభ్యర్థుల్ని బెదిరించడం.. లాంటివి చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు గట్టిగానే వినిపించాయి. అయితే.. ఇప్పటి వరకూ.. జగన్మోహన్ రెడ్డి దీనిపై నోరు మెదపలేదు. మొదటి సారి.. దీనిపై స్పందించారు. టీఆర్ఎస్ మద్దతిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. పైగా.. ప్రత్యేకహోదాకు కేసీఆర్ మద్దతిస్తున్నారని చెప్పుకొచ్చారు.
కేసీఆర్‌లో జగన్‌కు అంత ఆంధ్ర ప్రేమ ఎలా కనిపించింది..?
ఎన్నికల ప్రకటనకు ముందు నుంచి.. తెలంగాణ కేంద్రంగా.. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు.. ఏపీ ప్రజల్లో ఆత్మగౌరవం అనే భావనను పెంచాయి. డేటా చోరీ పేరుతో… ఏపీ అంతర్గత విషయాల్లో వేలు పెట్టడం, పదే పదే వైసీపీ నేతలు తెలంగాణ పోలీసుల వద్దకు వెళ్లడం, రిటర్న్ గిఫ్టులిస్తా అంటూ.. కేసీఆర్ రెచ్చగొట్టారు. అంతకు ముంతు తెలంగాణ ఎన్నికల ప్రచారం.. ఆంధ్ర పెత్తనం అవసరమా అంటూ చేసిన ప్రచారం ఇంకా చెవుల్లో ఉండగానే… ఏపీపై పెత్తనానికి జగన్ ద్వారా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనే సూచనలు గట్టిగానే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇప్పుడు ఆత్మగౌరవ నినాదం హోరెత్తుతోంది. మాపై ఆంధ్రుల పెత్తనం ఏమిటన్న టీఆర్ఎస్ పెద్దలు… జగన్‌ను అడ్డం పెట్టుకుని ఏపీపై పెత్తనానికి వస్తున్నారన్న బలమైన అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దీనిపై ఇప్పటి వరకూ ఏమీ మాట్లాడని జగన్.. హఠాత్తుగా.. కేసీఆర్‌తో దోస్తీ తప్పేమిటని ప్రశ్నించారు. పైగా..కేసీఆర్ ప్రత్యేకహోదాకు మద్దతిస్తున్నారనే వాదన వినిపించారు. దీంతో ఒక్క సారిగా రాజకీయం మారిపోయింది.
సగటు ఆంధ్రుడికి ఉన్నంత ఆత్మగౌరవం జగన్‌కు ఉండదా..?
ఏపీ పట్ల కేసీఆర్ ఎంత దారుణంగా వ్యవహరించారో.. ఇతర పార్టీల నేతలు గుర్తు చేయడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటన… టీడీపీలోనే కాదు.. వైసీపీలోనూ కలకలం రేపింది. ప్రత్యేకహోదాకు టీఆర్ఎస్, కేసీఆర్ ఎప్పుడు మద్దతిచ్చారని.. అందరూ తలలు పట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో… మేడ్చల్ సభ నుంచి సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించడాన్ని… టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తెలంగాణను ఎండ బెడతారా అని కేసీఆర్ నుంచి దిగువ స్థాయి కార్యకర్తల వరకూ అదే పనిగా ప్రచారం చేశారు. ఏపీకి పరిశ్రమలన్నింటినీ తరలించేస్తారని చెప్పారు. తీరా ఎన్నికలయిన తర్వాత.. ఏపీలో జగన్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత కావాలంటే.. ప్రధానికి లేఖ రాస్తారనని.. ఓ ఆఫర్ ఇచ్చారు. కానీ రాయలేదు. దీనికే జగన్మోహన్ రెడ్డి పొంగి పోతున్నారు. గతంలో..టీఆర్ఎస్ ఎలాంటి విధానాలను అవలంభించిదో..తెలిసి కూడా..కేసీఆర్‌తో స్నేహం చాలన్నట్లుగా ఆయన ప్రకటన చేశారు. ఇందులో అసలు విషయం ఏమిటంటే.. దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ… అధికారంలోకి వస్తే .. ప్రత్యేకహోదా ఇస్తామని సమయం,సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నా.. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంత వరకూ స్పందించలేదు. కానీ.. హోదా ఇచ్చే, తెచ్చే.. అవకాశమే లేని.. ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే.. వంద శాతం అడ్డుకునే .. టీఆర్ఎస్ను మాత్రం.. జగన్ నమ్ముతున్నారు.
ఏపీ తీర ప్రాంతాన్ని తెలంగాణకు కట్టబెడతారా..?
వివాదాస్పద వాన్ పిక్ ప్రాజెక్టులో ప్రధాన వాటాను.. తెలంగాణ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండేవాళ్లు కొనుగోలు చేశారని.. జగన్ అధికారంలోకి వస్తే..దాన్ని క్లియర్ చేసి తెలంగాణకు అప్పగించేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇది ఏపీ ప్రజల్లో మరింత ఆందోళకు గురి చేస్తోంది. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్‌తో దోస్తీ తప్పేమిటన్న వాదన తీసుకొచ్చారు. దీంతో..రాజకీయం మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏపీ ఆత్మగౌరవాన్ని కించ పరిచేలా.. అతి పెద్ద సెల్ఫ్ గోల్‌ను జగన్ చేసుకున్నారని నమ్ముతున్నారు