ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ రోజుతో 300 రోజులకు చేరుకుంది. ఆ పార్టీ వర్గాలు దీన్నొక మైలురాయిగా చెబుతున్నాయి. వాస్తవానికి ఆయన పాదయాత్ర ప్రారంభించి ఏడాది దాటిపోయింది. గత ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అప్పటి షెడ్యూల్ ప్రకారం యాత్ర ఆర్నెలల్లో పూర్తి కావాలి. కానీ, ఏడాదికి సాగింది. అప్పట్నుంచీ ఇప్పటివరకూ అలుపెరుగని పాదయాత్ర చేస్తున్నారంటూ ఆ పార్టీ పత్రిక సాక్షి ప్రత్యేక కథనాలు ప్రచురించింది. నిజానికి, జగన్ పాదయాత్ర ఏకధాటిగా ఎక్కడ సాగింది..? ఎన్ని విరామాలు, ఎన్ని సెలవులు, ఎన్ని పండుగలు…! ప్రతీ గురువారం మధ్యాహ్నానికే యాత్రను ఆపేస్తారు. అక్కడి నుంచి మర్నాడు కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ బయల్దేరేస్తారు. అంటే, అది హాఫ్ డే యాత్ర. మరి, ఈ క్రమంలో ‘అలుపు ఎరుగని’ అనడానికి ఆస్కారం ఎక్కడుంది..?
‘ఇదే నా కసి’.. అంటూ మొదటి రోజు పాదయాత్రలో జగన్ గళమెత్తారు. ‘విడిపోయిన రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా అని నేను గట్టిగా నమ్ముతున్నా. అందుకే ప్రత్యేక హోదా తేవాలన్న కసి నాలో ఉంది. ప్రతీ విద్యార్థికీ ఉద్యోగం రావాలన్న కసి, రైతులకు వ్యవసాయం పండుగగా మార్చాలన్న కసి, మద్యపానం సంపూర్ణంగా నిషేధించాలన్న కసి నాలో ఉన్నాయి’ అంటూ జగన్ తొలిరోజు చెప్పారు. ఇవాళ్ల 300వ రోజు! మరి, ఏ కసితో అయితే పాదయాత్ర మొదలైతే… ఈరోజుకు చేరుకునేసరికి అదే కసి కొనసాగిందా..? జగన్ పాదయాత్రలో అదే సంకల్పం ఇప్పటికీ బలంగా కనిపిస్తోందా..? దాదాపు ఏడాది పాటు సాగిన యాత్రలో ఆ కసి ఏం సాధించింది..? ఎవరి మెడల్ని వంచగలిగింది..? ఇలాంటి ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా సమాధానం దొరకని పరిస్థితి..!
మొదటి రోజు… ప్రత్యేక హోదా సాధించడమే కసి అన్నారు జగన్! ఇవాళ్ల 300 రోజు… హోదా కోసం జగన్ చేసిన పోరాటాల ఫలితాలేవి..? ఎంపీలతో రాజీనామాలు చేయించారు. వీసమెత్తైనా ఉపయోగం ఉందా..? సాధించి తీరతామని తొలిరోజు గర్జించారు… కానీ, ఇవ్వాల్సిన కేంద్రం ఇప్పటివరకూ గర్జన సంగతి దేవుడెరుగు.. కనీసం గట్టిగా డిమాండ్ కూడా చెయ్యలేకపోయారు. మొదటిరోజు పాదయాత్రలో జగన్ మాట్లాడుతుంటే… ఎన్నో లక్ష్యాలతో ఆయన బయలుదేరుతున్నారు అనిపించింది. కానీ, 300 రోజులకు వచ్చేసరికి… ఆ లక్ష్యాలను మార్గమధ్యంలోనే జగన్ వదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీని, ముఖ్యమంత్రినీ విమర్శించడం… ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఒక్కటే ప్రస్తుతం జగన్ కి ఉన్న కసిగా కనిపిస్తోంది.