ప్రజావేదికను.. కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై… టీడీపీ అధినేత చంద్రబాబు చాలా నింపాదిగా ఉన్నారు. అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అయితే ప్రజావేదికను కూల్చి వేయాలనుకోవడం సరి కాదని మాత్రం వ్యాఖ్యానించారు. అక్రమ కట్టడం అన్న కారణం అయితే… ఊరూరా.. పెట్టిన.. వైఎస్ విగ్రహాల సంగతేమిటని ప్రశ్నించారు. ఓదార్పు యాత్ర సమయంలో.. కొన్ని వేల వైఎస్ విగ్రహాలను వైసీపీ కార్యకర్తలు, నేతలు రోడ్లుపై ఏర్పాటు చేశారు. వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. సిటీలో ఏర్పాటు చేసినా… గ్రామాల్లో నిర్మించినా.. ఎక్కడా అనుమతలు తీసుకోలేదు. చాలా వరకూ గ్రామాల్లో రోడ్లపైనే ఉంటాయి. వీటినే … మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
యూరప్ పర్యటనను నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు.. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. తాను దేశంలో లేనప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలపై చర్చించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను చంద్రబాబు ఖండించారు. నెల రోజుల్లోనే టీడీపీ కార్యకర్తలపై 130కిపైగా దాడులు చేశారని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికే దాడులే నిదర్శనమన్నారు. విదేశీ పర్యటన నుంచి హైదరాబాద్ చేరుకునే ముందే… తన కుటుంబసభ్యులకు భద్రత తగ్గించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రాణాలతో చెలగాటం ఆడే చర్యలను నేతలు ఖండించారు. రాష్ట్రంలో విత్తనాల కొరతను పరిష్కరించాలన్న టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజావేదిక ను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని.. అడ్డుకునే దిశగా.. ఎలాంటి చర్యలను టీడీపీ చేయవద్దని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. కూల్చివేత అనేది కచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత పెంచుతుందని… జగన్మోహన్ రెడ్డి.. వ్యక్తిత్వం ప్రజలకు అర్థమయ్యేలా చేస్తుందన్న అంచనాలో టీడీపీ నేతలు ఉన్నారు. అందుకే.. ప్రభుత్వం చేయాలనుకున్న చేయనివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మామూలుగా … ప్రకటనలకు మాత్రమే పరిమితం కావాలని…ఆందోళనలు వద్దని అంటున్నారు.