జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి భవిష్యత్ ఉందా అన్నదానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ప్రారంభమయింది. అత్యంత ఘోరంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. జగన్మోహన్ రెడ్డి మనస్థత్వం ప్రకారం చూస్తే… ఆయన బయటకు వచ్చే అవకాశాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడే ఆయన భయం భయంగా గడిపారు. ఇప్పుడు ప్రజల మధ్య తిరిగేందుకు ఆయనకు ధైర్యం ఉండకపోవచ్చు. అంతకు మించి ఆయన ఓటమిని ఓటమిలాగా తీసుకునే అవకాశాలు లేవు. ఈ విషయాలను పక్కన పెడితే..జగన్ రెడ్డిని క్యాడర్ ఇంకా ఎంత నమ్ముతుందన్నది సందేహాస్పదంగా ఉంది.
ఎమ్మెల్సీ, రాజ్యసభే కాదు వార్డు మెంబర్ పదవులు కూడా కష్టమే !
వైసీపీ క్యాడర్ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే జగన్ రెడ్డికి వచ్చిన ఘోర పరాజయానికి భవిష్యత్ ఒక్క పదవి కూా రాదు. గతంలో ఓడిపోయినా అరవై మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండేవారు. ఎమ్మెల్సీ పదవులు వచ్చేవి.కానీ ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో రాజ్యసభ కాదు కదా ఎమ్మెల్సీ కూడా రాదు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించాలో జగన్ రెడ్డి చూపించారు కాబట్టి… పార్టీ క్యాడర్ కూడా పోటీ చేయడానికి జంకే పరిస్థితులు ఉంటాయి. అందుకే వైసీపీ క్యాడర్ పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయింది.
పెద్దిరెడ్డి జగన్ వెంట ఉంటారా ?
వైసీపీలో తనతో పాటు కుటుంబసభ్యుల్ని గెలిపించుకున్న ఏకైక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబును, బాలకృష్ణను ఓడించే మిషన్ తీసుకుని ఆయా చోట్ల వందల కోట్లు ఖర్చు పెట్టిన ఆయన పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. చంద్రబాబుపై ఆంగళ్లులో హత్యాయత్నం వెనుక ఆయన ఉన్నారనేది బహిరంగరహస్యం. ఆయనను టీడీపీ నేతలు వదిలి పెట్టే అవకాశం లేదు. అందుకే తన ఆస్తులను చాలా వరకూ ఆఫ్రికాకు తరలించారు. కానీ ఆయన పారిపోవడం సాధ్యం కాదని అంటున్నారు. అందుకే సేఫ్ జోన్ లో ఉండేందుకు బీజేపీలో లేదా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం ఎమ్మెల్యేల్లో ఐదారుగురు కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్యం లేదన్న చర్చ ఇప్పటికే జరుగుతోంది.
షర్మిలకు గోల్డెన్ చాన్స్
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతోంది. ఇలాంటి సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిలకు ఎంతో మంచి అవకాశం వచ్చినట్లే. ఆమె పూర్తి స్థాయిలో వైఎస్ కుమార్తె తరహా రాజకీయం చేస్తే వైసీపీ క్యాడర్ ను తమ పార్టీలోకి తీసుకుంటే… క్రమంగా వైసీపీ బలహీనపడుతుంది. ఏ విధంగా చూసినా చంద్రబాబు,లోకేష్ లా పోరాడే పరిస్థితి జగన్ కు లేదు. అందుకే వైసీపీ మనుగడ విషయంలో వచ్చే కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.