తెలంగాణలో ఎన్నికల కమిషన్ వైఖరి విమర్శలకు తావిస్తోంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత విషయంలో ఈసీ చూసిచూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మసీదు వైపు బాణం వేసినట్లుగా మాధవీలత సైగ చేసిన వీడియోపై ఫిర్యాదులు అందటంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 295/A కింద ఆమెపై కేసు నమోదైంది. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఇంతవరకు స్పందించలేదు.
ఇటీవల ఎన్నికల ఊరేగింపు సందర్భంగా మసీదు వైపు బాణం వేసినట్లుగా మాధవీలత సైగ చేసిన వీడియో బయటకు రావడం వివాదాస్పదం అయింది. ప్రత్యర్ధి పార్టీలన్నీ ఆమె వైఖరిని తప్పుబట్టాయి. శాంతికి నిలయంగా ఉన్న హైదరాబాద్ లో ఇలాంటి చేష్టలతో రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఈ వీడియోను పరిశీలించి మాధవీలతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిజానికి మాధవీలత చేష్టలు రెచ్చగొట్టేలా ఉన్నాయనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. రోజులు గడుస్తున్నా మాధవీలత మసీదు వీడియోపై ఎన్నికల కమిషన్ చడీ చప్పుడు చేయడం లేదు. ఈసీ ఉదాసీనతను విమర్శిస్తూ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారిందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయి.
ప్రజల మధ్య ఉద్రిక్తతలను పెంచేలానే మాధవీలత వీడియో ఉందని, ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని… ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి మాధవీలతపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.