శాసనమండలిని రద్దు చేయాలని తీర్మానం చేసి.. కేంద్రానికి పంపిన వైసీపీ… ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అనూహ్యమైన అభ్యర్థిని ఖరారు చేసింది. చాలా మంది నేతలు రేసులో ఉన్నప్పటికీ… ఇటీవలే పార్టీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు టిక్కెట్ కేటాయించారు. నిజానికి ఈ సీటు ఎమ్మెల్సీ ఆయనదే. ఆయన టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాజధాని విషయంలో మండలిలో మద్దతు కోసం వైసీపీ చేసిన ప్రయత్నాల్లో ఆయన ఆ పార్టీ వైపు మొగ్గారు. కీలక సమయంలో రాజీనామా చేసేశారు. దాంతో.. ఉపఎన్నిక అనివార్యమయింది. తర్వాత డొక్కా.. మళ్లీ వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన ఖాళీ చేసిన సీటును ఆయనకే.. వైసీపీ హైకమాండ్ కేటాయించింది. అంటే ముందస్తు ఒప్పందం ప్రకారం.. ఆ పార్టీ నుంచి మారి..ఈ పార్టీలో ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్నారన్నమాట.
నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారమే ఆఖరి రోజు. అందుకే.. ఒక్క రోజు ముందుగా.. హడావుడి లేకుండా.. డొక్క పేరును ఖరారు చేశారు. నామినేషన్ల చివరి రోజు అయిన ఇరవై ఐదో తేదీన డొక్కా నామినేషన్ వేస్తారు. శాసనసభ్యుల కోటాలో ఈ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు కాబట్టి.. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం లేదు. అంటే.. డొక్కా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ఎమ్మెల్సీ సీటుకు జగన్ పోటీ పెట్టరని.. చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే.. మండలి అనవసరం అని జగన్ శాసనసభలో తేల్చి చెప్పారు. ఏడాదిలో తమకు మెజార్టీ వస్తుందని తెలిసినా కూడా.. తాము మండలిని రద్దు చేయాలని తీర్మానించుకున్నామని…. అది అసలు అవసరం లేదని.. జగన్ అసెంబ్లీలో కుండ బద్దలు కొట్టారు.
వైసీపీ తరపున మండలిలో సభ్యులుగా ఉండి.. మంత్రులుగా ఉన్న వారిని రాజ్యసభకు పంపారు. వారితో మంత్రి పదవులకు రాజీనామాలు చేయబోతున్నారు. ఇంత గట్టిగా మండలి రద్దుకు ప్రయత్నిస్తున్న జగన్… ఇప్పుడు అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చని అనుకున్నారు. అయితే.. మండలి సీటును.. టీడీపీకి వదిలేయడం కన్నా.. పోటీకి పెట్టి ఏకగ్రీవం చేసుకోవడం మంచిదని భ ావించినట్లుగా తెలుస్తోంది. మండలి రద్దు చేయాలని తీర్మానం చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై.. రాజకీయ విమర్శలు వైసీపీ ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.