తెలుగుదేశంలో చేరాక జంప్ జిలానీల పరిస్థితి ఆత్మరక్షణలో పడింది..! ఫిరాయింపు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావజాలాన్ని పూర్తిస్థాయిలో పుణికిపుచ్చుకునే పనిలోపడ్డారు. ఫిరాయింపుల్ని సమర్థించుకుంటున్నారు. పైగా, ఫిరాయింపు నేతల్లో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కేశాయి కదా. ఇన్నాళ్లూ ఫిరాయింపుదారులను వెనకేసుకుని రావడం చంద్రబాబు పనే అన్నట్టుగా ఉండేది. అందుకే, ఫిరాయించిన వారెవ్వరూ నోరెత్తలేదు. అంతా చంద్రబాబే చూసుకుంటారు అనుకున్నారు. కానీ, ఇప్పుడు వారు కూడా స్పందిస్తున్నారు. ఫిరాయింపులపై తాజాగా మట్లాడారు టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. ఆయన మాటలు వింటుంటే.. ఎలాంటి డొక్కా, తెలుగుదేశంలోకి వెళ్లాక ఎలా మాట్లాడుతున్నారో అనిపించక మానదు!
ఫిరాయింపులు అనేవి ఒక రాజకీయ పార్టీకి పరిమితమైన అంశం కాదని డొక్కా చెప్పుకొచ్చారు. ఒక ప్రాంతానికీ, ఇంకా చెప్పాలంటే ఒక రాష్ట్రానికి కూడా పరిమితమైన అంశం కాదని అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి కూడా డొక్కా మాట్లాడటం విశేషం! పార్లమెంటులో ఎప్పటి నుంచో ఫిరాయింపులపై చర్చ జరుగుతోందన్నారు. అన్ని పార్టీ ఇదే అంశమై మరింత కూలంకషంగా చర్చించి, చట్టంలో ఉన్న లోటుపాట్లను తొలగించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ కూడా ఓ సూచన చేశారండోయ్. ఇతరులపై బురద చల్లే కార్యక్రమాలు జగన్ తగ్గించుకోవాలన్నారు. ఫిరాయింపులపై జగన్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని డొక్కా విశ్లేషించారు.
కర్ర విరగకుండా.. పాము చావకుండా అన్నట్టుగా ఫిరాయింపుల గురించి డొక్కా భలే మాట్లాడారు! ఫిరాయింపు రాజకీయాలను జనరలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పే కాదనీ.. ఇతర పార్టీలూ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలానే జరుగుతోందని అనడం విచిత్రం! ఫిరాయింపులు అనేవి ఆమోదయోగ్యమైన రాజకీయ ప్రక్రియగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా చెప్పండీ..?
ప్రజాతీర్పును వెక్కిరిస్తూ.. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ… ఒక పార్టీ టిక్కెట్ పై గెలిచాక, మరో పార్టీలోకి మారడం అనేది నీతిమాలిన రాజకీయం. ఫిరాయింపుల్ని ప్రజలు ఇలానే చూస్తున్నారు. ఈ ప్రక్రియను ‘చంద్రబాబు చాణక్యం’ అని అభివర్ణించుకుంటూ జంప్ జిలానీలు మురిపోవచ్చేమోగానీ… ఆ పరిస్థితిలో ప్రజలు లేరు. ఈ వాస్తవం అర్థం చేసుకోకపోతే, అర్థమయ్యేలా ప్రజలే చెప్పే రోజులు వస్తాయి